(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అన్యోపదేశంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీని ఇరకాటంలో పెడుతున్నాయి. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు ఒకటి, రెండు పెద్ద రాద్ధాంతం సృష్టించగా, విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు రాజధాని తరలింపుపై చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం సృష్టించాయి. అదే మాదిరిగా వైసీపీ సీనియర్ నాయకుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు గతంలో శ్రీకాకుళం జిల్లా పునర్విభజనపై వైసీపీ ప్రభుత్వ తీరును బహిరంగంగా తప్పు పట్టిన విషయం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది.
ధర్మాన వ్యాఖ్యలతో దుమారం
‘పెదవి దాటిన మాట .. పుడమి దాటుతుంది’ అనే చందంగా .. ఒక్కోసారి అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు పెద్ద అలజడి సృష్టిస్తుంటాయి. రాజకీయాల్లో బాధ్యత కలిగిన వ్యక్తులు చేసే వ్యాఖ్యల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిణామమే.. శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. అది కూడా రాజకీయ దిగ్గజం.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కారణంగా వైసీపీ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాల ఏర్పాటును జగన్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించింది. అయితే దీనిని అన్యోపదేశంగా ప్రస్థావించిన ధర్మాన ప్రసాదరావు.. తన సొంత జిల్లా శ్రీకాకుళంను విభజిస్తే.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న జిల్లా, ఆర్థికంగా.. విద్యాపరంగా కూడా మరింతగా వెనుకబడి పోతుందంటూ కొన్నాళ్ల కిందట బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ వైసీపీకి ఇబ్బందిగానే ఉంటున్నాయి. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా విభజన విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆయన వెళ్లిన ప్రతీచోట ‘మీ నాయకుడు ధర్మాన ప్రసాదరావే.. జిల్లాను విభజించరాదని చెప్పారంటూ’ ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అందువల్ల ఆయన ముందడుగు వేయలేకపోతున్నారని, దీంతో ఇటీవల ఓ పర్యటనను కూడా మంత్రి రద్దు చేసుకున్నారని తెలుస్తోంది.
Also Read ;- త్వరలో బీజేపీకి కన్నా గుడ్ బై ?
ససేమిరా ..
పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లా విభజన అంటే.. విజయనగరం పార్లమెంటు పరిధిలోకి వచ్చే శ్రీకాకుళంలోని కొన్ని నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో చేరిపోతాయి. దీంతో ఆ ప్రాంత పరిధిలోని ప్రధాన పరిశ్రమలు, విద్యా వాణిజ్య సంస్థలు శ్రీకాకుళం జిల్లా కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళానికి అన్యాయం జరుగుతుందనేది భావన మాజీమంత్రి ధర్మాన వ్యక్తం చేశారు. ధర్మానకు ఉన్న ఇమేజ్ నేపథ్యంలో.. జిల్లా ప్రజలు ఆయన చెప్పిన దానినే విశ్వసిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా శ్రీకాకుళం జిల్లా ఉనికిని కాపాడతామంటూ ప్రభుత్వం ప్రకటిస్తున్నా, మంత్రులు, ఎమ్మెల్యేలచే ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా ససేమిరా అంటున్నారు.
టీడీపీ కూడా ..
జిల్లా విభజనను టీడీపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైసీపీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు చెప్పిన దాన్నే.. ఇటీవల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉటంకించారు. జిల్లా విభజనతో ఎంతో నష్టపోతుందని మీ నాయకులే చెబుతున్నప్పుడు.. ఎలా విభజిస్తారనే ప్రశ్న వీరు లేవనెత్తుతున్నారు. అదిప్పుడు వైసీపీకి సమాధానం చెప్పలేని ప్రశ్నగా మారడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా.. గతంలో ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం సృష్టిస్తుండటం వైసీపీకి రాజకీయ సంకటంగా మారినట్లు తెలుస్తోంది. తనకు మంత్రి పదవి దక్కలేదనో.. పార్టీలో ప్రాధాన్యం లేదనో.. తన సీనియార్టీని పట్టించుకునే నాథుడు కనిపించడం లేదనో ప్రసాదరావు చేసిన ఆక్రోశపూరితమైన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు.. ప్రతిపక్షాలకూ ఈ వ్యాఖ్యలు ఆయుధాలుగా మారుతుండటం గమనించదగ్గ విషయం.
Must Read ;- వైసీపీ గూటికి బొబ్బిలి రాజులు ..?











