ఏ విషయమైనా కావచ్చు.. అది ప్రతి పక్షానికి సంబంధించిందైనా.. ఈసీ పనైనా.. ఆఖరికి ఖైదీల సంగతైనా సరే.. ఏపీలో కోర్టు జోక్యం చేసుకోనిదే పని జరగట్లేదు. ఆఖరికి ఖైదీలకు వేతనం పెంపు విషయంలో కూడా కోర్టు మొట్టికాయలు వేయందే జీవో జారీ చేయలేదు ఏపీ ప్రభుత్వం. తమ ఆదేశాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటోందని, ఈ విధానాన్ని వీడాలని అన్నారు న్యాయమూర్తులు. దీంతో.. ప్రభుత్వం.. ఆగమేఘాల మీద జీవో జారీ చేసింది.
ఖైదీలకు న్యాయబద్ధమైన వేతనం చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ 2019లో న్యాయవాది తాండవ యేగేశ్ పిల్ దాఖలు చేశారు. ఖైదీల వేతనానికి సంబంధించి 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం నైపుణ్యం, సగం నైపు ణ్యం ఉన్న, నైపుణ్యం లేనివారిగా విభజించి రూ.30, రూ.50, రూ.70 వేతనాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా… వేతనాలు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇస్తుందని వారం గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది.. హైకోర్టుకు విన్నవించుకున్నారు. ధర్మాసనం 2వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణ నాటికి జీవోను కోర్టు ముందుంచాలని ఆదేశించింది.
ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పరిపాలనా జాప్యం వల్ల ఉత్తర్వులు సమర్పించలేక పోతున్నామని, విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఆ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమర్‌తో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణలో వారం సమయం అడిగితే, 14 రోజుల గడువిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. వెంటనే జీవో జారీ చేసి, ఆ కాపీని సాయంత్రం 4గంటలకు కోర్టు ముందుంచాలని, విఫలమైతే బాధ్యులైన అధికారులు కోర్టుముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం ఆదేశాల పట్ల అధికారులకు గౌరవం ఉండాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలను సీఎస్, హోంశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. విచారణను సాయంత్రం 4గంటలకు వాయిదా వేసింది.
సాయంత్రం విచారణ ప్రారంభమైన వెంటనే జీవో కాపీని ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు ఇచ్చిన హామీలకు అధికారులు విలువ ఇచ్చేలా చూడాలని ఏజీకి కోర్టు సూచించింది. న్యాయస్థానం ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని పేర్కొంది. సరైన స్ఫూర్తితో అమలు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తామని ఏజీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కేసు విచారణను ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Must Read ;- నీలం సాహ్నీ, ద్వివేదీలకు హైకోర్టు సమన్లు..