‘బిగ్ బాస్’ సీజన్ 4లో అరియానా చాలా సందడి చేసింది. మొదటి నుంచి కూడా చాలా తెలివిగా .. ధైర్యంగా గేమ్స్ ఆడుతూ వచ్చింది. ఆమె తెగింపుకు అఖిల్ .. సోహెల్ వంటివారే ఆశ్చర్యపోయారు. ఒకానొక దశలో ఆమె పోటీని తట్టుకోవడం వాళ్లకి కష్టమైపోయింది. ఏ సందర్భంలో ఎలా స్పందించాలి? ఎంతవరకూ స్పందించాలి? అనే విషయం అరియానాకు బాగా తెలుసు. తనకి నచ్చని విషయాలని నిర్భయంగా చెప్పడం .. ఆ విషయంపై లాజికల్ గా ఆర్గ్యూ చేయడంలో ఆమె ఎక్కువ మార్కులను .. ఎక్కువ ఓట్లను కొట్టేసింది.
అరియానాలోని ఈ లక్షణాలే ఆమెను ఈ సీజన్లో ‘టాప్ 5’ ప్లేస్ లో నిలబెట్టాయి. మొదటినుంచి అరియానా గేమ్స్ ఆడే తీరును చూస్తూ వచ్చిన వాళ్లు ఆమె ‘టాప్ 3’లో నిలిచే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. ఇక విజేతగా నిలిచే ఛాన్స్ కూడా లేకపోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. చివరికి రామ్ గోపాల్ వర్మ నుంచి కూడా ప్రశంసలు అందుకుందంటే, అరియానా ప్రత్యేకత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆమె ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీ అయింది.
తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, అవినాశ్ తో తనకి ఏర్పడిన సాన్నిహిత్యాన్ని గురించి ప్రస్తావించింది. “అవినాశ్ ‘బిగ్ బాస్’ హౌస్ లోకి రాకముందే, నేను ఆయన గురించి విన్నాను. అవినాశ్ కి బయట మంచి పాపులారిటీ ఉంది. అందువలన ఆయనకి పొగరు ఎక్కువగానే ఉంటుందని అనుకున్నాను. ఆయనతో సాధ్యమైనంత తక్కువగా మాట్లాడాలనీ, దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నాను. కానీ దగ్గర నుంచి చూసిన తరువాతనే ఆయన ఏమిటనేది నాకు అర్థమైంది. నా మైండ్ సెట్ ను ఆయన పూర్తిగా మార్చేశాడు .. నాకు మంచి స్నేహితుడయ్యాడు.
ఎంతగా ఎదిగినా ఒదిగి ఉండాలనేది నేను అవినాశ్ లో చూశాను. తనకి మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ హౌస్ లో ఆ లెవెల్ చూపించేవాడు కాదు. మొదటి నుంచి కూడా నేను సమయానికి తినే దానిని కాను .. ఆ విషయాన్ని అవినాశ్ గ్రహించాడు. సమయానికి తింటానని చెప్పమంటూ నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. ఇక హౌస్ లో మేం చనువుగా ఉండటం చూసి చాలామంది చాలా రకాలుగా ఊహించుకున్నారు. నిజానికి మా మధ్య మరే ఆలోచన లేదు .. మేమిద్దరం మంచి స్నేహితులం .. అంతే” అని చెప్పుకొచ్చింది.
Must Read ;- లవ్ స్టోరీ బయటపెట్టిన మోనాల్.. !