దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పేదలు బీజేపీకి పట్టం కట్టారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల వంతు వచ్చిందని బండి సంజయ్ అన్నారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన ప్రసగించారు. పేదల వలే ఆలోచించి.. బీజేపీని గెలిపిస్తారో.. లేదో మేధావులే నిర్ణయించుకోవాలని చెప్పారు. కేసీఆర్ సీఎం పదవిని చెప్పుతో సమానమని అవమాన పరిచారని గుర్తు చేశారు. ఓటర్లు ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఓటెయ్యాలని, ఆ ఓటు విలువను కేసీఆర్‌కు తెలిసేలా చెయ్యాలని సూచించారు.
2014లోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినం..
తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 2014లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు బండి సంజయ్. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్ల.. వేరే రాష్ట్రానికి పోయిందని తెలిపారు. న్యాయం జరగాలని వ్యాగన్ ట్రాక్ ఇచ్చారని.. 2017 వరకు దానికీ స్థలాన్ని కేటాయించలేదని చెప్పారు. కిషన్‌రెడ్డి, తాను తిడితే ఎండోమెంట్ స్థలాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అబద్ధాలు ఆడటంలో కేసీఆర్, కేటీఆర్ ముందుంటారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ఇంట్లో వాటాల కొట్లాట..
ముఖ్యమంత్రి ఇంట్లో వాటాల కోసం కొట్లాట జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో అర్థం కాని అయోమయంలో కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారని తెలిపారు. సీఎంకు ప్రజల గురించి ఆలోచించే అంత ఖాళీ లేదన్నారు. మానుకోట రాళ్లకు మళ్లీ పని చెప్పాలని కోరారు. మేధావులంతా మరోసారి ఆలోచించి, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Must Read ;- వాస్తవం గ్రహించిన కేంద్ర బీజేపీ.. తిరుపతి ఎంపీ టిక్కెట్టు జనసేనకే..!