‘జబర్దస్త్’ కామెడీ షో చాలా పాపులర్ .. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా పరిచయమయ్యారు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోను అవకాశాలు సంపాదించుకున్నారు. అలా ‘ముక్కు అవినాశ్‘ కూడా ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘బిగ్ బాస్’ సీజన్ 4లో ఆయన కూడా ఒక పోటీదారుడిగా కొనసాగాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చిన అవినాశ్, 13వ వారంలో బయటికి రావలసి వచ్చింది. ఆరంభంలో హౌస్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడుతూ వచ్చిన అవినాశ్, క్రమేణా టెన్షన్ పెంచుకుంటూ ఎంటర్టైన్ చేయలేకపోవడమే ఇందుకు కారణమనే టాక్ వినిపించింది.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. “నేను చాలాకాలం నుంచి ‘జబర్దస్త్‘ చేస్తూ వస్తున్నాను. అయితే సొంత ఇల్లు కొనుక్కోవడం కోసం నేను కొన్ని అప్పులు చేయవలసి వచ్చింది. ఆ అప్పులు తీర్చడం కోసం ‘జబర్దస్త్’ వారు ఏమైనా సహాయం చేస్తారేమోనని అడిగాను. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇవ్వలేమని చెప్పారు. నా ఇబ్బందులు చెప్పేసి వేరే షో కోసం బయటికి వెళతానని అన్నాను. అలా అయితే ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 10 లక్షలు కట్టమన్నారు.
వాళ్లు అలా అడగడం కరెక్ట్ కాదని నేను అనడం లేదు .. వాళ్ల సమస్యలు వాళ్లకు ఉన్నాయి. కాకపోతే నేను చాలా కాలంగా అక్కడ పనిచేశాను గనుక, అప్పులు ఉన్నాయి గనుక అలా అడిగాను. బయటికి వెళతానంటే రెండు .. మూడు లక్షలు కట్టించుకోవచ్చులే అనుకున్నాను. కానీ వాళ్లు 10 లక్షలు ఇస్తేనే పంపిస్తామని అన్నారు. మళ్లీ వేరే చోట అప్పుచేసి వాళ్లకి ఆ డబ్బు సర్దుబాటు చేశాను. మళ్లీ రావొద్దనే వాళ్లు చెప్పారు .. కానీ వాళ్లు పిలుస్తారనే ఆశ ఉంది. అలా పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగానే ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- అవినాశ్ వెల్ కమ్ బ్యాక్ పార్టీలో శ్రీముఖి సందడి