తెలంగాణలో బీజేపీ దెబ్బకు గులాబీ దళపతి మోడీతో కాళ్ల బేరానికి వచ్చారని కర్ణాకర్ణిగా చాలా వార్తలు వ్యాపిస్తున్నాయి. నిప్పులేనిదే పొగ పుట్టదు. తెలంగాణలో తనకు ఎప్పటికీ తిరుగేలేదన్నట్టుగా ఇన్నాళ్లూ చెలరేగుతూ వచ్చిన గులాబీ దళపతి.. మోడీతో బేరానికి దిగడం కీలక పరిణామం.. వర్తమాన రాజకీయాల్లో ఒక ప్రధాన అధ్యాయం అయితే.. దానికి అనుబంధ అధ్యాయమే ఇవాళ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర. మోడీ తరఫున తెలుగురాష్ట్రాల బాధ్యత తీసుకున్న అమిత్ షా.. వ్యూహాత్మకంగా.. జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ వ్యూహం ఏమిటో తదనుగుణంగా నడుచుకోవాల్సిందేనంటూ.. జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా హితవాక్యాలు చెప్పబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఏం జరుగుతోంది?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రికి అమిత్ షాతో భేటీ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పోలవరం నిధుల వ్యవహారం, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యల గురించి జగన్- అమిత్ షాతో చర్చిస్తారని అధికారులు ప్రకటించారు. ఇదంతా అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అసలు కారణాలు వేరే ఉన్నాయి.
Must Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!
ఏం జరిగింది?
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కేసీఆర్ దాదాపు సైలెంట్‌గానే ఉన్నప్పటికీ.. గ్రేటర్ సమరం సందర్భంగా బీజేపీపై నిప్పులు చెరిగారు. ఫలితాలు వచ్చిన తర్వాత.. బీజేపీ దెబ్బకు దారుణంగా భంగపడిన తర్వాత కూడా ఆ పార్టీ మీద తన దాడిని కొనసాగించారు. బీజేపీకి కంటగింపు కలిగించేలా, కాలుముల్లు అనిపించేలా రైతుల బంద్‌కు అధికారికంగా మద్దతిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కమలదళాలకు వ్యతిరేకంగా తమ పార్టీ తరఫున నిరసనగళాలను వినిపించారు.
అయితే ఈ వ్యవహారంలో రెండో ఎపిసోడ్ కు వచ్చేసరికి అనూహ్యంగా స్క్రిప్టు మారిపోయింది. కేసీఆర్ ఢిల్లీ యాత్ర పెట్టుకున్నారు. ప్రధాని, ఇతర కేంద్రంలోని పెద్దలను కలవడం అనేది కేవలం లాంఛనం కావొచ్చునని, భాజపాయేతర పార్టీలను కూడగట్టడానికి భేటీలు ఉంటాయని కూడా పుకార్లు వినిపించాయి. కానీ జరిగింది వేరు.
కేసీఆర్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిశారు. వంగి వంగి దండాలు పెట్టారు. ఈ వాక్యం కాస్త వెటకారంగా అనిపించవచ్చు గానీ.. వాస్తవంలో జరిగిన దానికి అక్షరరూపం అచ్చంగా అదే! మోడీతో భేటీ సందర్భంగా కేసీఆర్ ఏం చెప్పారు? బీజేపీలని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. తెరాస తరఫున తాము ఎప్పటికీ బీజేపీకే మద్దతుగా నిలుస్తామని, పైకి రాజకీయ పోకడలు ఎలా ఉన్నప్పటికీ.. మోడీ నిర్ణయాలకు బాసటగా నిలుస్తామని, వ్యక్తిగతంగా తాను తొలినుంచి కాంగ్రెస్ వ్యతిరేకతతోనే పెరిగానని, సహజంగానే మోడీ వర్గానికి అనుకూలంగా ఉండగలనని కేసీఆర్ పదేపదే మోడీకి విన్నవించుకున్నట్లుగా సమాచారం. అయితే- కేసీఆర్ ఎన్నిరకాలుగా మోడీకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. మోడీ సాంతం విని.. తన స్పందన ఏమిటో తెలియజెప్పకుండానే తిప్పిపంపేసినట్లు తెలుస్తోంది. ఈ పుకార్లకు తగినట్టుగానే.. కేసీఆర్ ఢిల్లీనుంచి తిరిగివచ్చిన తర్వాత.. బీజేపీ సర్కారు మీద దాడి ఉధృతి మళ్లీ కనిపించలేదు.
ఇదే సమాచారం మరింత ధ్రువీకరించుకునేలా.. మరికొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బండి సంజయ్‌ను పార్టీ హస్తినపెద్దలు పిలిపించారు. 2023లో తెలంగాణలో కూడా మనమే అధికారంలోకి రాబోతున్నామని.. ప్రస్తుతం తెరాస మీద సాగిస్తున్న దాడి ఉధృతిని ఏమాత్రం తగ్గించాల్సిన అవసరం లేదని బండి సంజయ్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ మోడీని కలిసి వచ్చిన వెంటనే.. బండి సంజయ్ ఢిల్లీ వెళ్లడంతో.. ఆయనను స్పీడ్ తగ్గించమని హితవు చెబుతారన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారానికి పూనుకున్న వారంతా షాక్ తిన్నారు. హస్తినలోనే బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ మరింత దూకుడు ప్రదర్శించారు. దీంతో.. బండి సంజయ్ కు హస్తిన పెద్దలు ఎలాంటి సంకేతాలు ఇచ్చారో అర్థమైపోతోంది.
బండి సంజయ్ కు అత్యంత సన్నిహితులైన వారి ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. 2023లో అధికారంలోకి మనమే రాబోతున్నామని.. ఏమాత్రం దూకుడు తగ్గించకుండా దూసుకువెళ్లమని.. సంజయ్ తో ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు సమాచారం.
Also Read ;- జగన్ బావనా మజాకానా.. అనిల్‌కు ఎంత ఫుల్ సెక్యూరిటీనో చూశారా?
ఏం జరగబోతోంది?
ఈ వ్యవహారాలకు సంబంధించి హస్తిన కమలనేతల వ్యూహాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కేసీఆర్‌ను మరింతగా చట్రంలో బిగించేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనేది వారి ఆలోచన. అందులో భాగంగానే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హస్తిన పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో జగన్మోహన్ రెడ్డికి మైత్రీబంధం గట్టిగానే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో కూడా.. వైసీపీకి జంటనగరాల్లో ఉన్న నాయకులు కొందరు.. పోటీచేయాలని ఉత్సాహం చూపినప్పటికీ.. జగన్ వారికి బ్రేకులు వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలందరూ తెరాస విజయానికి అనుకూలంగా పనిచేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పిలుపు కీలకంగా కనిపిస్తోంది.
అమిత్‌షా ఏం చెప్పబోతున్నారు?
‘మీకూ- కేసీఆర్‌కు స్నేహబంధం ఉంటే దాన్ని పదిలంగా కాపాడుకోండి. స్నేహాన్ని అలాగే కొనసాగించండి. అంతే తప్ప.. ఆ స్నేహాన్ని రాజకీయాల్లోకి తీసుకురాకండి’ అనే సందేశాన్ని అమిత్ షా, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వబోతున్నారని సమాచారం. కేసీఆర్ తనంత తానుగా ఢిల్లీ వచ్చి.. సాగిలపడినప్పటికీ.. ఆలకించకుండా.. ఆయనను మరింతగా దెబ్బకొట్టడానికి.. తెలంగాణలో తమ అధికారం ఏర్పడేలా వ్యూహరచన చేయడానికి బీజేపీ నిర్ణయించుకున్నదన్న సంగతి స్పష్టంగానే తెలుస్తోంది. అయితే.. కేసీఆర్ కు, జగన్మోహన్‌రెడ్డి నుంచి ఎలాంటి నైతికపరమైన సహాయ సహకారాలు కూడా అందకుండా ఉండేలా.. చట్రం బిగించడమే ఈ పిలుపు వెనుక ఆంతర్యం అని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాల్లో జగన్ ను పూర్తిగా సైలెంట్‌గా మార్చడమే వారి ప్రస్తుత టార్గెట్ అని సమాచారం.
తెలుగు రాష్ట్రాలపై ఫోకస్
దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ గరిష్టంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో వారు కొద్దిగా అనుకున్నట్టుగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పై ముందుముందు అదే స్థాయిలో దృష్టిసారించబోతున్నట్లుగా తెలస్తోంది. ఇవాళ అమిత్ షా ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్ తో రాజకీయ దూరం పాటించే అవకాశం ఉంటుంది. కానీ.. అదే సమయంలో.. ముందు ముందు ఏపీలో కూడా బలపడడానికి బీజేపీ వైఎస్సార్సీపీని కూడా టార్గెట్ చేయదని గ్యారంటీ ఏముంది. అంతిమంగా తమ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే పార్టీ.. వ్యూహాలను ఏ రీతిగానైనా మార్చుకోడానికి, ఎవరినైనా బలిపెట్టడానికి సదా సిద్ధంగానే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
Also Read ;-, తాడేపల్లి కోటలోకి.. పాత కేసుల్లోని ‘జగన్ దళం’!