జీహెచ్ఎంసీ ఎన్నికల వాతావరణంతో హైదరాబాద్ వేడెక్కింది. ఎన్నికల హామీల నేపథ్యంలో పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌కు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం నగరంలో బండి సంజయ్ తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను ఉద్ధేశిస్తూ మాట్లాడారు.
హైదరాబాద్ మేయర్ పీఠంను బీజేపీ దక్కించుకున్న తరువాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ జరిపిస్తామని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసులు కూడా ఓట్లు వేస్తారని ఆరోపించారు. రోహింగ్యాలు ఓట్లు లేని ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నాక పాతబస్తీలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలను, పాకిస్తాన్ వాసులను తరిమి తరిమి కొడుతామని ఆయన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి నగరం కావాలా.. అరాచక హైదరాబాద్ కావాలా అని తెలిపారు. హిందూస్తాన్ హైదరాబాద్ కావాలా.. భారతదేశ హైదరాబాద్ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన చెప్పారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
మరోపక్క బీజేపీ ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షులు తేజస్వీ సూర్య ఈ రోజు ఉస్మానియా యూనివర్శిలో విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడేందుకు బయలుదేరారు. అయితే ఆయనను పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఎన్నికల నేపథ్యంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
Must Read ;- సొంత గూటిలో శత్రువు.. రేవంత్‌కు టచ్‌లో బీజేపీ నేత?