దుబ్బాక ఎన్నికల వాతావరణమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మనకు కనబడుతోంది. అక్కడ ఎలాగైతే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ నడిచిందో గ్రేటర్ ఎన్నికల్లోనూ అలాంటి వార్‌యే నడుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. గత ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. గంటకో నాయకుడు మీడియా ముందుకు వచ్చి సమావేశాన్నిపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరుగుతోంది. మరోవైపు జాతీయ నాయకులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ దూకుడుకు కారణం బీజేపీ సాధించిన దుబ్బాక ఎన్నికల విజయమే. దుబ్బాక విజయం ఆ పార్టీకి మంచి బూస్ట్‌నే ఇచ్చిందని చెప్పాలి. దుబ్బాకలో ఎలాగైతే తమకు ప్రత్యర్ధి పార్టీ అయిన టీఆర్ఎస్‌ను దూకుడుగా వ్యవహరించి ఎలా అడ్డుకుందో సరిగ్గా అదే స్ట్రాటజీని గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రదర్శిస్తుంది. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మనకిదే స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ పార్టీ రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే బీజేపీ ప్రచార సభలను నిర్వహించి పార్టీకి నూతనోత్తేజం తీసుకొచ్చేందుకు వ్యూహాలను రస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మొన్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఆయన చేతులతో గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై ఛార్జ్ షీట్‌ను విడుదల చేయించారు. దానికి కౌంటర్‌గా మంత్రి కేటీఆర్ ఈ రోజు ఘాటుగానే బీజేపీకి బదులిచ్చారు. బీజేపీకి అవకాశం వస్తే చార్మినార్, గోల్కొండను కూడా అమ్మేస్తారని ఆరోపించారు. ఇలా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
రూ.25వేలు ఇస్తారా?..
బిల్డర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొనడంతోపాటు బిఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో కూడా నిన్న మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో బీజేపీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద సాయం కింద తమ ప్రభుత్వం రూ.10 వేలు ఇస్తుంటే.. ఆపినోళ్లు.. రూ.25 వేలు ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత అర్హత ఉన్న వారికి మళ్లీ వరద సాయం చేస్తామని మంత్రి తెలిపారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అంటే నో డేటా అవైలబుల్ ప్రభుత్వమని మంత్రి చురకలంటించారు. ఏదైనా సమాచారం అడిగితే వారి వద్ద అది ఉండదని తెలిపారు. ప్రధాని ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందని ప్రశ్నించారు. డైలాగులు భలే చెప్తారు కానీ బీజేపీ నేతల వద్ద అసలు విషయం ఉండదని కేటీఆర్ విమర్శించారు. కాoగ్రెస్ హయాంలో బాంబ్ బ్లాస్టులు జరిగాయన్నారు. ఆరేళ్లలో అలాంటివి ఏమైనా నగరంలో చోటు చేసుకున్నాయానని కేటీఆర్ ప్రశ్నించారు. గత ఆరేళ్లలో కేంద్రానికి రాష్ట్రం రూ.2.72 లక్షల కోట్లు కడితే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ.1.40 కోట్లేనని తెలిపారు. గుజరాత్ గులాములు కావాలా? లేక హైదరాబాద్ గులాబీలు కావాలో ఓటర్లే తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
Must Read ;- దుబ్బాకను ప్రభావితం చేసిన వర్క్ ఫ్రం హోం