గ్రేటర్‌లో స్పీడ్ పెంచింది బీజేపీ. గెలుపే లక్ష్యంగా భారీగా చేరికలకు తెర లేపింది. గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలంతా గ్రేటర్‌లోనే ఉంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పార్టీలో చేరేందుకు వస్తున్న వారికి కండువాలు కప్పుతూ ఆహ్వానిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మేయర్ పీఠమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని చెబుతున్న ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ , టీఆర్ఎస్‌లలో అసంతృప్తులుగా ఉన్న వారిని తమ వైపు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలతో మంతనాలు పూర్తి కాగా మరికొంత మందితో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయి నాయకులు మొత్తం తలో బాధ్యతను తీసుకుని చేరికలపై దృష్టి సారిస్తున్నారు. టీఆర్ఎస్ అదిష్టానం తీరుపై లోలోన ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి తమ పార్టీలో చేరమంటూ రాయబారాలు పంపుతున్నారు. ఇక తమ ఇష్ట పూర్తిగా వస్తున్న వారికి కూడా రెడ్ కార్పేట్ వేసి ఆహ్వానిస్తున్నారు.
డివిజన్ల వారీగా నేతల కోసం వేట…
గ్రేటర్ హైదరాబాద్‌లో నేతలంతా ప్రస్తుతం చేరికలపై దృష్టి సారించారు. వీలైనన్ని ఎక్కువ మంది చేరికలను ప్రోత్సహించడం ద్వారా ఓట్లను రాబట్టుకోవచ్చన్నది బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపించే ఆశావాహులు వారి బయోడేటాను జిల్లా అధ్యక్షులకు ఇవ్వాలంటూ సూచించింది. దీంతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ కార్పోరేటర్లు, ప్రస్తుత కార్పోరేటర్లతో పాటు ఆశావాహులు తమ బయోడేటాను పార్టీ నాయకులకు ఇచ్చి టికెట్ ఇవ్వాలంటూ కోరుతున్నారు . సొంతంగా కొంత మంది టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా మరి కొందరు తమకు తెలిసిన వారి ద్వారా బీజేపీ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో నగరంలో కీలక నేతలుగా ఉన్న వారిపై దృష్టి సారించింది బీజేపీ . అధికార , విపక్షం అన్న తేడా లేకుండా అందరూ తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ నేతలు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు.
Also Read ;- గ్రేటర్ ఎన్నికల పోరుకు చంద్రబాబు డైరెక్షన్!
మాజీ మేయర్‌కు ఆహ్వానం
నగర మాజీ మేయర్ బండ కార్తికను చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది బీజేపీ నాయకత్వం. బండ కార్తికతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది డివిజన్ ఇన్‌ఛార్జిలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీకి చెందిన ప్రస్తుత , మాజీ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ కండవా కప్పుకున్నారు. నగర వ్యాప్తంగా బీజేపీ నేతల వేట సాగుతుండగా మిగతా పార్టీలు ఎప్పుడు ఏ నేత తమ నుండి చేజారిపోతారో అన్న ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఆ పార్టీలో భారీగా చేరికలతో జోష్‌లో ఉండగా .. తమ నేతలు జారిపోతున్నారన్న గుబులు మాత్రం ఇతర పార్టీలను వెంటాడుతోంది.
Also Read ;- బీజేపీ వైపు నేతల చూపు..











