గ్రేటర్ ఎన్నికలు ఇచ్చిన జోష్ తో బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీ బాట పట్టారు. ఎన్నికల్లో తాము అనుసరించిన వ్యూహాలను ఢిల్లీ పెద్దలకు వివరిచేందుకు వారంతా ఢిల్లీ వెళ్ళారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసలు కారణం మరోటి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తాజా ఫలితాల నేపథ్యంలో బీజేపీలోకి వలస పర్వం మొదలైంది. గ్రేటర్ ఫలితాల కోసం ఎదురుచూసిన ఇతర పార్టీల నేతలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి వలస పర్వం కొనసాగుతోంది. నిన్ననే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి విజయ శాంతి ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయింది. ఈ రోజు నడ్డా ఆధ్వర్యంలో అధికారికంగా తిరిగి పార్టీలో చేరింది. విజయ శాంతితో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు సైతం ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీకి కొండా.. అంజన్..
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు బీజేపీ వైపు చూస్తున్నారు. వారు కూడా నేడు ఢిల్లీ వెళ్ళనున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో ఇద్దరు మాజీ ఎంపీలున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ కమలతీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. గ్రేటర్ ఫలితాల సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ బీజేపీలో ఆయన చేరికను కన్ఫర్మ్ చేసింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై అలకబూనిన మాజీ సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌ను బీజేపీ నాయకులు సంప్రదించారని సమాచారం. ఆయన బీజేపీలో చేరుతానన్న వార్తలను ఖండించలేదు.. అలాగని సమర్థించలేదు. దీంతో నేడు కాకపోయినా రేపైనా బీజేపీలో చేరుతారని అంతా చెప్పుకుంటున్నారు. సోమవారం ఆయన కూడా ఢిల్లీ వెళ్తున్నారన్న వార్తలతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. అమిత్ షాను, నడ్డాను కలిసే జాబితాలో వారి పేర్లు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Also Read ;- మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు కమలం గూటికి!
గోవానుంచి నేడు ఢిల్లీకి జానారెడ్డి..
జాతీయ ఇంటెలీజెన్స్ వర్గాల సమాచారం మేరకు నేడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా వెళ్తున్నట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన పార్టీ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు సైతం ఆయన దూరం అవుతూ వస్తున్నారు. నాగార్జున సాగర్ కే పరిమితం అయ్యారు. ఆయన కొడుకు ప్రస్తుతం క్రియాశీలంగ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో వారు ఇప్పుడు బయటకు రాకుండా ఉండలేని పరిస్థితి.
నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయన నోముల నర్సింహయ్య చేతిలో అనూహ్యంగా ఓడి పోయారు. ఆ తరువాత ఆయనపై సానుభూతి పెరిగింది. ఇక ఆ నియోజక వర్గంలో ఉప ఎన్నిక రావడంతో జానారెడ్డి కుటుంబంపై అందరి దృష్టి పడింది. ఆయన తప్ప మరెవరూ ఆ నియోజక వర్గంలో గెలవరన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఆయన తమతోనే ఉండాలని భావిస్తోంది. పక్క చూపులు చూడకుండా మంతనాలు సాగిస్తోంది. అయితే ఆయనను సంప్రదించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది.
జానారెడ్డి ప్రస్తుతం గోవాలో ఉన్నారని చెబుతున్నారు. అయితే నేడు ఆయన కూడా ఢిల్లీ వెళ్తారని గోవా నుండి నేరుగా ఆయన వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. రెండు రోజు కిందట తాము పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఖండించారు.
అయినా, ఆయన ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నాయి ఢిల్లీ వర్గాల సమాచారం. మరి ఈ నేతలు ఢిల్లీ వెళ్ళీ బీజేపీ కండువా కప్పుకుంటారా లేదా అన్ని సస్పెన్స్‌గా మారింది.
Must Read ;- ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీ జోష్..