తెలంగాణలో రోజురోజుకు భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. సమగ్ర భూ సర్వే పేరుతో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా ఆ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భూ వివాదాలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వ, వక్ఫ్, ఆలయ, గురుకుల్ ట్రస్ట్.. ఇలా అనేక విభాగాల భూములు ఇప్పుడు అన్యాక్రాంతం అయ్యాయంటోంది బీజేపీ. రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా దానిపై అక్రమార్కుల కన్ను పడుతోంది. నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇనాం భూములు ఎన్నో ఇప్పుడు భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని, వాటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
అఖిలప్రియ, ప్రవీణ్‌రావ్‌ల వ్యవహారంతో..
రెండు రోజుల క్రితం రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రవీణ్‌రావ్ కిడ్నాప్ వ్యవహారంతో హైదరాబాద్‌లో భూముల అక్రమాలు మరోసారి బయట పడ్డాయి. దీంతో అసలు ఈ భూమి ఎవరిదన్న దానిపై అంతా ఎక్వైరీ మొదలు పెట్టారు. బీజేపీ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసి అసలు ఆ భూమిపై అఖిలప్రియకు గాని , ప్రవీణ్ రావ్‌కు గాని ఎలాంటి హక్కు లేదని చెబుతోంది. నకిలీ పత్రాలను సృష్టిచి ఈ భూమిని కేసీఆర్ కుటుంబం కొట్టేయాలని చూస్తోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరుగుతోంది. ప్రవీణ్‌రావ్ కేసీఆర్ బంధువు కాబట్టే పోలీసులు ఇంత వేగంగా స్పందించారని బీజేపీ నేతలు అంటున్నారు.
అన్ని రంగాల్లోనూ మాఫీయా..
తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రం మాఫియా గుప్పెట్లోకి వెళ్ళిందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు . ఇసుక, భూములు, డ్రగ్ మాఫియా ఇలా అన్నింటా కేటీఆర్ అస్త్రం ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మియాపూర్ భూములు, తాజాగా హఫీజ్‌పేట భూములను కొట్టేయాలని కేసీఆర్ కుటుంబం చూస్తోందని.. అసలు హఫీజ్‌పేట భూములు ఎవరివో తేలాల్సిన అవసరం ఉందంటున్నారు. భూ ఆక్రమణలు అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లు, గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రమేయం లేకుండా ఇదంతా జరగదని ప్రభాకర్ అంటున్నారు. ఈ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌నే భూ మాఫియా వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో నార్సింగ్‌లో భూములను తమ పేరుమీద మేయర్ బొంతు రాం మోహనే అగ్రిమెంట్ చేయించుకుని ఆక్రమించే ప్రయత్నం చేసారంటూ ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడితే నిజానిజాలు బయట పడతాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అంటున్నారు. మరి బీజేపీ ఆరోపణలపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Must Read ;- ధరణి దెబ్బ.. కేసీఆర్‌కు గట్టిగానే తగిలిందిగా !