తెలంగాణ వైసీపీ నాయకులు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేయాలని సంకల్పిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తమాషా ఏంటంటే ప్రజలకు మాత్రం.. తెలంగాణ వైసీపీ అనే పార్టీ ఒకటి మనుగడలో ఉందా అనే సందేహం వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. వైఎస్ రాజశేఖరరెడ్డికి అన్ని తెలుగు ప్రాంతాల్లో ఉండే అపారమైన జనాదరణ దృష్ట్యా.. వైసీపీకి కూడా తెలంగాణ ప్రాంతంలో అనన్యమైన ప్రజాదరణ ఏర్పడింది. నాయకులు, కార్యకర్తలు అందరూ తయారయ్యారు. నిజానికి వైసీపీ పార్టీ రిజిస్ట్రేషనే తెలంగాణ కు చెందిన వ్యక్తి పేరు మీద ఉంటుంది.
అయితే తర్వాతి కాలంలో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అనేదానిని అసలు ప్రజలు మర్చిపోయారు. అలాంటి పార్టీ ఉన్నదనే సంగతి కూడా మర్చిపోయారు. 2014 ఎన్నికలలో పోటీచేసి ఏదో కాస్త ఉనికి చాటుకున్నారు గానీ.. తర్వాతి కాలంలో జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ పార్టీని పూర్తిగా విస్మరించారు. అయితే తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వైసీపీ నాయకులు వెళ్లి.. జగన్ ను కలవాలని అనుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో తాము కూడా కొన్ని డివిజన్లలో పోటీచేయడం గురించి ఉత్సాహం చూపిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
Must Read: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ?
వైఎస్సార్ అభిమానం నుంచి, జగన్ ను ప్రత్యేకగా అభిమానించే వారు బోలెడు మంది ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంతంలో అది ఆయన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోడానికి తప్ప మరో కార్యక్రమానికి ఉపయోగపడడం లేదు. ఇప్పుడు హఠాత్తుగా వారి ఉత్సాహం ఎన్నికలవైపు మరలినట్లు కనిపిస్తోంది.
జీహెచ్ఎంసీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ పోటీచేస్తూ ఉండేసరికి వైసీపీకి కూడా మూడ్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే వారు జగన్ ను సంప్రదిస్తుండవచ్చు గాక. ఎటూ వైసీపీ కూడా తెలంగాణలో తమ అస్తిత్వం మిగిలిఉన్నదనే భ్రమలోనే బహుశా తమ పార్టీని జాతీయ పార్టీగా పరిగణించుకుంటూ.. పార్టీ పదవులు పంచి పెట్టిన నేపథ్యం కూడా ఉండవచ్చు. అయితే ఈ ఎన్నికల్లో వారు ఏం సాధించగలరు? అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే ఒంటరిగా పోటీచేసి నెగ్గడం వారికి కష్టం. అట్లాగని.. ఎంతగా టీఆర్ఎస్ తో స్నేహబంధం ఉంటే మాత్రం.. వారు ఒకటి రెండుసీట్లు వీరికి కేటాయిస్తారని అనుకోవడం కూడా భ్రమ. ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ వైసీపీ నాయకులు జగన్ ను కలిసినంత మాత్రాన ఎలాంటి హామీ తీసుకువస్తారో.. ఏం సాధిస్తారో.. మరో మూడు వారాల్లో తేలిపోతుంది.
Also Read: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడు టీఆర్ఎస్‌లోకి జంప్