జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, నోటిఫికేషన్ వెలువడడం జరిగిపోయింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఈక్రమంలో వలసలు ఊపందుకున్నాయి. తమకు రాజకీయంగా ఎక్కడ సముచిత స్థానం దక్కుతుందో ఆ పార్టీలోకి మారేందుకు నేతలు వలసల క్యూ కడుతున్నారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్ మాజీ మేయర్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి..
కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు గట్టి షాక్ తగిలినట్లే అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్‌గా చేసిన బండా కార్తీక ఈరోజు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను కలిశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం లేదా గురువారం బీజేపీలోకి చేరనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో బండ కార్తీక బీజేపీలోకి చేరడం కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గానే చేకూరనుంది. అయితే బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంఛార్జీ భూపేంద్ర యాదవ్ సమక్షంలో కార్తీక పార్టీలో చేరనున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈమె మేయర్‌గా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ టిక్కెట్ ఆశించి బంగపడ్డారు. దాంతో అప్పటి నుంచి ఆమె పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. భర్త బండా చంద్రారెడ్డితో కలిసి బండా కార్తీక బీజేపీలోకి చేరడం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Must Read ;- టీఆర్ఎస్‌ను ముంచిన ‘మూడో బటన్’.. హరీశ్ నోట ఆ మాట !
టీఆర్ఎస్ గూటి నుంచి…
అధికార పార్టీ టీఆర్ఎస్‌కు కూడా వలసల దెబ్బ తప్పడంలేదు. ఆ పార్టీ నుంచి ముఖ్యమైన నేత ఈ రోజు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ కురుమ సంఘం వైస్ ప్రెసిడెంట్ చీర సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారు. ఈ రోజు సాయంత్రం కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఆల్ఇండియా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో ఆయన పార్టీ మారనున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి రాంగోపాల్ పేట డివిజన్ టిక్కెట్ ఆశించి ఆయన బంగపడ్డారు. దీంతో ఆయన ఇప్పుడు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నేతలతో అశ్వద్థామ భేటీ..
బీజేపీ నేతలతో ఈ రోజు ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, టీఎంయు నేత అశ్వద్థామ రెడ్డి భేటీ అయ్యారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఆర్టీసీ టీఎంయు నేతగా ఆయన ఉన్నారు. అయితే ఆర్టీసీ సమ్మె తరువాత నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలతో ఆయన భేటీ ప్రధాన్యతను సంచరించుకుంది.
Also Read ;- గ్రేటర్ ఎన్నికల రంగంలోకి దిగుతున్న అమిత్‌షా, జెపీ నడ్డా?