ఎన్నికల ప్రచారానికి గడువు దగ్గర పడుతోంది. దీంతో పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచితే.. నేతలేమో మాటల్లో స్వరం పెంచారు. ఈనేపథ్యంలో నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డితో కలిసి గవర్నర్ తమిళసై సౌందర రాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్‌పై ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను బీజేపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
బీజేపీకి ప్రజలు మద్దతునిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వ్యవహరించే తీరు సరైంది కాదని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలు ఇస్తున్న సపోర్ట్‌ను చూసి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేంద్ర నాయకులు ఎన్నికల ప్రచారంలోకి పాల్గొంటే వారికొచ్చే ఇబ్బందేంటో తమకు అర్ధం కావటంలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై తమ పార్టీ కేంద్ర నాయకత్వంతో ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కావాలంటే మీరు కూడా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ను తీసుకొచ్చి ప్రచారం చేయించండని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతటితో ఆగకుండా లక్ష్మణ్.. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను, ఉగ్రవాది అజర్ మసూద్‌ను తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంను చేయించుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారితో ప్రచారం చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదని లక్ష్మణ్ ఆరోపించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం పెట్టుకుని పైకి మాత్రం తమ మధ్య పొత్తు లేదని మాయమాటలను చెబుతుందని పేర్కొన్నారు. బీజేపీని చూస్తుంటే టీఆర్ఎస్‌కు భయమేస్తుందని ఆరోపించారు.
బాబర్ సమాధులు ఉండాలా?…
ముషీరాబాద్‌లో ఈ రోజు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి లక్ష్మణ్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు వాయిదా వేయడానికి తండ్రి కొడుకులు కుట్రలు చేయిస్తున్నారన్నారు. మీ పాలనపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారే సరైన బుద్ది చెప్తారన్నారు. బాబర్ సమాధులను ఉండాలనే ఎఐఎం పార్టీ పీవీ, ఎన్‌టిఆర్ సమాధులను ఎలా కూలగొడుతుందన్నారు. సీఎం దీనిమీద ఎందుకు స్పందించరని లక్ష్మణ్ ప్రశ్నించారు.
Must Read ;- పాకిస్తాన్‌లో బయటపడ్డ 1300 ఏళ్లనాటి పురాతన హిందూ ఆలయం











