తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం మంత్రి వర్గం సమావేశం కానుంది. అందులో ముగ్గురు పేర్లను ఖరారు చేసి కేబినెట్ ఆమోదం తెలపనుంది. రేపు లేదా ఎల్లుండి ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సామాజిక సమతుల్యత పాటించేలా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఓసీ వర్గాలకు చెందిన వారిని ఒక్కొక్కరితో ఈ మూడు స్థానాలలో కేటాయించనున్నారు. గవర్నర్ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురి పదవీ కాలం ఇప్పటికే ముగియడంతో కొత్తగా మరో ముగ్గురిని నామినేట్ చేయనున్నారు. క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఆ ముగ్గురు పేర్లను ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన తరువాత గవర్నర్ ఓకే చేసేస్తారు.
తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులున్నారు. 40 మంది సభ్యులున్న శాసన మండలిలో గవర్నర్ కోటా కింద 6 ఎమ్మెల్సీలు ఉంటాయి. అయితే ఇందులో గతంలో గవర్నర్ కోటా కింద ఎస్టీ సామాజిక వర్గం నుండి రాములు నాయక్, ఓసీ నుంచి నాయిని నర్సింహ్మారెడ్డి, బీసీ నుంచి కర్నె ప్రభాకర్ ఎన్నికయ్యారు. కేసీఆర్‌కు మంచి సన్నిహితుడిగా పేరున్న రాములు నాయక్ 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన టీఆర్ఎస్ నుంచి సస్పెండయ్యారు. మార్చిలోనే ఆయన పదవీ కాలం ముగిసింది. దివంగత మాజీమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పదవీ కాలం కూడా ఈ ఏడాది జూన్‌లోనే ముగిసింది. ప్రభుత్వ విప్‌గా ఉన్న కర్నె ప్రభాకర్ పదవీకాలం సైతం ఆగస్టులోనే ముగిసింది. దీంతో ఈ మూడు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. దాంతో కొత్త వారితో ఈ స్థానాలకు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. AlsoRead;-జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమిళనాడు ఫార్మాలా!
మరోసారి దక్కేనా?..
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడడంతో పదువుల కోసం పావులు కదుపుతన్న వారి సంఖ్య టీఆర్ఎస్‌లో భారీగానే ఉంది. క్యాబినెట్ ఆమోదం తెలిపే పేర్లలో ఎవరి పేర్లు ఉంటాయో లేదో అనే టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది. గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడిన వారిలో కర్నె ప్రభాకర్, నాయిని నర్సింహ్మారెడ్డి పేర్లు మొదటి నుంచి బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే నాయిని మరణించడంతో ఆయన కుటుంబంలో ఎవరికైనా చోటు కల్పిస్తారా? లేక మరెవరికైనా కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాల్సి ఉంటుంది. తనకు మరోసారి అవకాశం కల్పించాలని మండలి ప్రభుత్వ విప్ కర్నెప్రభాకర్ కోరుతున్నారు. మరోసారి తనకు ఛాన్స్ వస్తుందనే ధీమాలో కర్నె ఉన్నారు.
పోటీలో వీరి పేర్లు…
మూడు స్థానాలు భర్తీ అవుతుండటంతో ఆశావహుల లిస్ట్ కూడా చాలా పెద్దదిగానే ఉంది. గోరెటి వెంకన్న, సీఎంఓ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, నేతలు బస్వరాజు సారయ్య, దయానంద్, బ్రేవరజీస్ రార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్‌రావు, మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే దేశ మాజీ ప్రధాని పీవీ నర్సింహ్మారావు కుమార్తె వాణీదేవితో పాటు మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి.( AlsoRead;-బీజేపీలోకి హైదరాబాద్ మాజీ మేయర్?)
ట్రెండ్ మారేనా?
ఎమ్మెల్సీ నియామకంలో ఈసారి కేసీఆర్ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ భర్తీ ప్రక్రియను రాజకీయ నేతలతోనే భర్తీ చేస్తున్నారనే అంశం గవర్నర్ తమిళసై దృష్టికి వచ్చినట్లు తెలిసింది. క్రీడలు, కళలు, సేవా రంగాలకు చెందిన వారి సలహాలు, సేవలు ప్రభుత్వానికి అవసరమయ్యే విదంగా ఎమ్మెల్సీ భర్తీ ప్రక్రియను చేపట్టాలని డిమాండ్లను పలువురు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 15 మంది తమకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ ఇవ్వాలని గవర్నర్‌కు దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిసింది. ఏకంగా రాజ్‌భవన్‌కు లేఖలు కూడా రాశారట. అయితే ఈవిషయాన్ని గవర్నర్.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినారట. ఈక్రమంలో ఈసారి కేటాయింపుల్లో కళలు, సేవా రంగాలకు చెందిన వారికి కూడా ఇందులో ప్రాధాన్యమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కళాకారుడు, కవి, రచయిత గోరేటి వెంకన్న, మరొక కవి, సీఎంఓ ఓఎస్‌డీ అయిన దేశపతి శ్రీనివాస్ పేరు కూడా వినబడుతోంది. మూడు స్థానాలలో రాజకీయ నేతలతో భర్తీ చేయకుండా సమన్యాయం పాటించేలా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
ఓట్ల కోసమేనా?…
డిసెంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ప్రత్యేక ఓటు హక్కును గవర్నర్ కోటా కింద ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు ఉంటుంది. ఎక్స్ అఫిషియో ఓటు హక్కుతో పాటు, ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాల ఓట్లను కొల్లగొట్టేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ రోజు ఆ ముగ్గురి పేర్లను క్యాబినెట్‌లో ఖరారు చేసి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
AlsoRead;-రూ.550 కోట్లల్లో రూ.387 కోట్లు పంచేశారట!











