తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేడర్‌ను భవిష్యత్ పోరాటాలకు సిద్ధం చేసేందుకు ప్రయత్నించింది. రాష్ట్ర ముఖ్యనేతలతో పాటు తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి సైతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రర్యటిస్తూ కేడర్‌లో నూతన ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన కార్యవర్గ సమావేశాల్లో రాబోయే ప్రభుత్వం తమదేనని.. మరో మూడేళ్ల పాటు కార్యకర్తలు, నేతలు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలంటూ సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పడకేసిన అభివృద్ధి, సచివాలయంకు కూడా రాని ముఖ్యమంత్రి , అవినీతి వంటి అంశాలను గడప గడపకు తీసుకు వెళ్ళడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయానికి వచ్చింది బీజేపీ. దీంతో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే విధంగా దూసుకెళ్ళాలంటూ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
Must Read ;- దూకుడుగా బీజేపీ.. ఇంకా ఆలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు
కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం..
రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువ అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఇళ్ల నిర్మాణం, రైతు సమ్మాన్ నిధి, మహిళా సంక్షేమ పథకాలు, అయోధ్య రామాలయ నిర్మాణం ఇలా అనేక అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది తెలంగాణ బీజేపీ. మరోవైపు టీఆర్ఎస్ వైఫల్యాలను కూడా బీజేపీ ప్రచారానికి వినియోగించుకోవాలనుకుంటోంది. దళిత ముఖ్యమంత్రి, డబ్ బెడ్రూం ఇళ్లు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి, వరదల సమయంలో, అకాల వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ కనీసం ప్రగతి భవన్, ఫాం హౌజ్ దాటి బయటకు రాలేదని, ప్రజల సంక్షేమం పట్టని ముఖ్యమంత్రి మనకు అవసరమా అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతోంది. కేంద్ర నిధులతో అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వద్దకు చేరనివ్వకుంటా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే పనిలో పడింది. దీంతో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తూనే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలకు చేరవయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టబోతోంది.
రుద్రమ దేవి ఆదర్శంగా పోరాటం..
తెలంగాణలో మహిళలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పడింది బీజేపీ. తెలంగాణలో పేరున్న రాణి రుద్రమ దేవిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కార్యకర్తలు, నేతల సమావేశాల్లో ఆమె పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. యువకులు, మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని.. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని.. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. మహిళలను తమ వైపు తిప్పుకుంటే వేగంగా ప్రజల హృదయాల్లోకి వెళ్ళవచ్చనే భావనలో బీజేపీ నేతలు ఉన్నారు. మొత్తానికి బీజేపీ నిర్వహించిన కార్యవర్గ సమావేశాల్లో కేడర్‌లో నూతన ఉత్సాహం తీసుకువచ్చేందుకు నాయకులు ప్రయత్నించారు. నాయకులు.. రాబోయే రోజుల్లో కూడా ఇదే జోష్ కొనసాగించేలా పోరాట యోధుల పేర్లను ప్రస్తావిస్తూ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Also Read ;- టీఆర్ఎస్‌పై సర్జికల్ స్ట్రైక్‌కు బీజేపీ సిద్ధం..