గ్రేటర్ వరంగల్, ఖమ్మంలలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో అధికార టీఆర్ఎస్‌కు చెమటలు పట్టించిన ఆ పార్టీ ఇక మిగతా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లలో పాగా వేసేందుకు సాయ శక్తులా కృషి చేస్తోంది. ఏ అవకాశం దొరికినా బీజేపీ వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే గ్రేటర్ వరంగల్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించి వచ్చారు. ఇక జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి నేతలు అక్కడే మకాం వేసి పరిస్థితులను చక్కబెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో బీజేపీ బలం పెరిగేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో ఉన్న ముఖ్యనేతలను తమవైపు తిప్పుకోవడంతో బిజీ అయిపోయారు. క్షేత్ర స్తాయిలో బలంగా ఉండి పదవులు లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపారు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ ఇలా ఏ పార్టీలో ఉన్న వారైనా డివిజన్‌లను ప్రభావితం చేసే నేతల కోసం వేట మొదలు పెట్టారు.
మంత్రి సోదరుడికే వల..
ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావ్ సోదరుడిని తమ వైపు తిప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. పవన్ కళ్యాణ్ ఈ వ్యవహరాన్ని చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావ్‌తో సంప్రదింపులు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఆయనతో ఇప్పటికే ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా ఆయనతో చర్చల ప్రక్రియ ముగిసింది. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన బీజేపీలో చేరితే ఖచ్చితంగా పది నుండి 12 సీట్లు బీజేపీ గెలుచుకోవడమే కాకుండా మరో 10 డివిజన్లలో టీఆర్ఎస్ ఓటమికి కారణమ వుతారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో ఆయనతో మంత్రి ఎర్రబెల్లి చర్చలు జరిపి పార్టీ మారకుండా ప్రయత్నం చేశారని తెలుస్తోంది. మంత్రి మంత్రాంగం ఫలించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుండి ఆయనకు ఇవ్వాల్సిన అస్యూరెన్స్ ఇచ్చారని.. ఇక ఆయన ఈ నెల చివర్లోనో.. జనవరి మొదటి వారంలోనో బీజేపీలో చేరడం ఖాయమని వరంగల్ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయనకు బీజేపీ నుండి ఇప్పటికైతే ఎలాంటి హామీ రాకపోయినా గ్రేటర్ వరంగల్‌లో ఆయన పరిధిలోని డివిజన్‌లను గెలిపించుకుంటే ఖచ్చితంగా గౌరవ ప్రదమైన పదవి ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇక ఈయనతో పాటు శాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి కూడా బీజేపీలో చేరిక ఖాయమయిపోయిందని తెలుస్తోంది. దీంతో ఎన్నికల కంటే ముందే కనీసం 11 డివిజన్ లు తమకు ఖాయం అయిపోయాయంటున్నారు బీజేపీ వరంగల్ నేతలు.ఖమ్మంలో కమల వికాసానికి..
ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్‌లో సైతం ప్రజలకు చేరవయ్యేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మంలో టీఆర్ఎస్ బలం అంతంత మాత్రమే. అక్కడ బడా నేతలు ఉన్నా ప్రస్తుతం వారు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఒక్కరే టీఆర్ఎస్ పార్టీకి దిక్కయ్యారు. ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయనపైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని స్థానికులు చెబుతున్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక టీఆర్ఎస్‌కు క్షేత్ర స్థాయిలో బలం లేదు. బీజేపీకి కూడా ఏమాత్రం బలం లేకున్నా ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజీగా ఉన్న వారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఉన్న కార్పోరేటర్లు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీ ముఖ్యనేతలు వారిని సంప్రదించి తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కాస్త ఆర్థిక సాయం చేస్తే కనీసం 50 సీట్లు వస్తాయంటున్నారు. మరి బీజేపీ నేతలు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేక .. కింది స్థాయి నేతలను వదిలేసి బడా నేతలపైనే దృష్టి సారిస్తారో చూడాలి.
Also Read: కూకట్‌పల్లిలో టీఆర్ఎస్‌కే పట్టంకట్టిన ఆంధ్రోళ్లు!