తెలంగాణలో బీజేపీ పోరు ఉధృతం చేసింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు క్షేత్రస్థాయిలో పోరు బాట పట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు ఏదో ఓ అంశాన్ని లేవనెత్తుతూ నిరసన కార్యక్రమాలకు పిలుపు నిస్తోంది. గతంలో లాగా కేవలం హైదరాబాద్‌కే ఈ కార్యక్రమాలను పరిమితం చేయకుండా అన్ని జిల్లా , మండల కేంద్రాలలో కార్యకర్తలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టడంలో భాగంగా ఏ చిన్న అంశాన్ని వదిలి పెట్టడం లేదు. పార్టీకి అనుబంధంగా ఉన్న అన్ని మోర్చాలను యాక్టివ్ చేస్తూ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం స్వయంగా నిరసనల్లో పాల్గొంటూ ఉత్సాహం నింపుతున్నారు.
తెలంగాణలో ఒకే రోజు రెండు మూడు అంశాలపై బీజేపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. విద్యార్థుల సమస్యల నుండి సినిమా ఇష్యూల వరకు అన్ని వివాదాలపై బీజేపీ స్పందిస్తోంది. రాష్ట్ర నాయకత్వం నుండి గ్రామ నాయకత్వం వరకు ఈ ఆందోళన్లో పాల్గొంటున్నారు. మొన్న దళిత నిధుల కోసం ఎస్సీమోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ల ముట్టడి చేపట్టగా.. నిన్న గ్రేటర్‌లో కొత్త పాలక మండలి ఏర్పాటుపై కార్పోరేటర్లు, ఢర్టీ హరీ సినిమా విడుదలను ఆపాలంటూ యువజన మోర్చా ఆధ్వరంలో ఆందోళన చేపట్టారు. ఇక జిల్లాల్లో ప్రోటోకాల్ ఇష్యూలను కూడా బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకుంటున్నారు. గతంలో లాగా చూసీ చూడనట్టు వదిలేయకుండా స్పాట్‌లోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని పోలీసులు తేరుకునేలోపే పని కానిచ్చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆందోళన చేపడతారో తెలియక పోలీసులు కూడా కంటిమీద కునుకు లేకుండా పహారా కాయాల్సి వస్తుందంటున్నారు.
మరో వైపు చేరికలు..
గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు పెంచింది. ప్రజల్లో పట్టున్న నేతలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. చోటా బడా అన్న తేడా ఏమీ లేదు. తన పరిధిలో కొంత బలం ఉందని తెలిస్తే చాలు వారిని తమలో కలిపేసుకుంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్నపార్టీ తేడా లేకుండా నేతలను ఆకర్శిస్తున్నారు. గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు చేరికలు భారీగా జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింత మంది ముఖ్యనేతలు చేరబోతున్నట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ నేత దరువు ఎల్లన్న, రేపో మాపో మరో నేత దాసోజు శ్రవణ్ సైతం బీజేపీ వైపు చూస్తున్నారన్నచర్చ పార్టీలో సాగుతోంది. ఇక బీజేపీతో టీఆర్ఎస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ సంజయ్ చెప్పుకొస్తున్నారు. బీజేపీ పక్కా ప్రణాళికతో రాష్ట్రంలో పుంజుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
Must Read ;- టీఆర్ఎస్‌పై సర్జికల్ స్ట్రైక్‌కు బీజేపీ సిద్ధం..