(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాలో ‘ఆపరేషన్ ఆకర్ష్‘తో భారతీయ జనతాపార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస, శ్రీకాకుళం పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది అధికార, ప్రతిపక్ష నాయకులను పార్టీలో చేర్చుకున్నారు.
మంత్రి ‘సీదిరి’కి ఝలక్
రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆయన అనుచరగణం గట్టి షాక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆయన వెంటుండి విజయానికి కారకులైన పలాస నియోజకవర్గం మందసాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వైసీపీ నాయకుడు కొర్ల కన్నారావు బీజేపీలో చేరారు. శ్రీకాకుళంలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేతుల మీదుగా బీజేపీ పార్టీ కండువా వేసుకున్నారు. టీడీపీ హయాంలో కన్నారావు భార్య కవిత మందస ఎంపీపీగా ఉన్నారు. రాజకీయ కారణాలతో పదవికి సగంలోనే రాజీనామా చేశారు. అప్పటి నుంచి కన్నారావు వైసీపీకి మద్దతుగా నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి అప్పలరాజు విజయానికి తనవంతు కృషి చేశారు. పలాసకు చెందిన పార్లమెంటు మాజీ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాధం తన అనుచరగణంతో కన్నారావుకు మద్దతు పలికారు. హిర మండలానికి చెందిన పలువురు వైసీపీని వీడి బీజేపీలో చేరారు. హిర మండలం వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు తంగి రమేష్, ఆ పార్టీ నాయకులు రవివర్మ శ్రీకాకుళంలో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో పార్టీలో చేరారు.
టీడీపీ నుండి ..
నందిగాం మండలం బీజేపీ నాయకుడు అట్టాడ రాజేష్ ఆధ్వర్యంలో కవిటి అగ్రహారం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వీరందరికీ బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Must Read: పవన్ కళ్యాణ్ అంటే బీజేపీకి అంత లోకువా!
స్వప్రయోజనాలే ..
వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలేనని, వారిని స్వప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టవని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అట్టాడ రవిబాబ్జి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అభివృద్ధి అంటే డబ్బులు పంచి పెట్టడం కాదని, జాతీయ రహదారుల నిర్మాణం, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య వైద్య రంగాల అభివృద్ధి వంటి పనులు చేపట్టాలన్నారు. అధికారం నిలబెట్టుకోవడం కోసం ప్రజలకు సంపదను పంచిపెట్టడం కాదన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం, రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర బీజేవైఎం కార్యదర్శి పూడి బాలాదిత్య, ఎఫ్‌సీఐ సభ్యులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.










