తెలుగు సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ ను ఇప్పుడు డ్రగ్స్ కేసు పట్టి పీడిస్తోందనే చెప్పాలి. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణలతో గతంలో తెలంగాణ అబ్కారీ శాఖ, ఇప్పుడు కొత్తగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. \గడచిన వారం పది రోజులుగా ఈడీ విచారణకు దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు దగ్గుబాటి రానా, చార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, నందూలు హాజరయ్యారు. గురువారం నాడు హీరో రవితేజ, నవదీప్ లు హాజరు కాబోతున్నారు. ఇలాంటి క్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్లామర్ కోసమట
డ్రగ్స్ వాడుతున్నట్టుగా సినీ ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. తాజాగా తెలంగాణలో అధికార పార్టీకి చెందిన నేతలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం నాడు సంగారెడ్డి నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే… ‘‘రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు వారి గ్లామర్ కాపాడుకోవడానికి డ్రగ్స్ వాడుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలను నిర్వహిస్తాం’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే.. టీఆర్ఎస్ నేతలు అంటూ ఆయన పేర్కొన్న నేతలు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గతంలో రేవంత్ కూడా..
బండి సంజయ్ మాదిరిగానే ఇటీవలే డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేరునే నేరుగా ప్రస్తావించిన రేవంత్.. కేటీఆర్ రహస్యంగా గోవా పర్యటనలకు ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అంతకుముందు కూడా డ్రగ్స్ కేసులో మహారాష్ట్ర పోలీసుల ఎదుట రకుల్ ప్రీత్ సింగ్ హాజరైన వైనాన్ని ప్రస్తావించిన రేవంత్. . కేటీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. తానేమీ ఎవరిమీదా ఆరోపణలు చేయడం లేదని, విచారణలోనే అన్ని విషయాలు నిగ్గు తేలతాయని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇప్పుడు బండి సంజయ్.. టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొందరు డ్రగ్స్ వాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Must Read ;- ఏడు గంటల పాటు రకుల్ విచారణ