బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. సాధారణంగా బాలకృష్ణ తన సినిమాల జయాపజయాలకన్నా, వరుస సినిమాలు చేసే విషయంలోనే ఎక్కువగా దృష్టి పెడతారు. సినిమాకి .. సినిమాకి గ్యాప్ రావడానికి ఆయన ఎంతమాత్రం ఇష్టపడరు. అయితే ఈ సారి బోయపాటి ప్రాజెక్టు సెట్ కావడానికీ .. అది పట్టాలెక్కడానికి ఆలస్యమైంది. దానికి తోడు లాక్ డౌన్ కారణంగా మరింత లేట్ అయింది. లేకపోతే ఈ సారి సంక్రాంతి బరిలో తన సినిమా ఉండేలా బాలయ్య చూసుకునేవారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. బోయపాటి తన సినిమాలో విలన్ పాత్రను చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేస్తాడు. అలా విలన్ కి ఒక రేంజ్ బిల్డప్ ఇచ్చి, హీరోయిజాన్ని మరింత పైకిలేపుతాడు. అందువలన ఆయన బాలయ్య క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే విలన్స్ ను సెట్ చేస్తుంటాడు. తాజా సినిమాలోను విలన్ పాత్రధారి కోసం బాగానే గాలించారు. ఆ జాబితాలో సునీల్ శెట్టి పేరు కూడా వినిపించింది.
ఈ సినిమాలో బాలయ్యతో తలపడే విలన్ పాత్ర కోసం సునీల్ శెట్టినే ఎంపిక చేశారనేది తాజా సమాచారం. త్వరలోనే ఆయన షూటింగులో జాయిన్ కానున్నారని అంటున్నారు. సునీల్ శెట్టికి గల ఇమేజ్ ఈ సినిమాకి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికలుగా ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ కనిపించనున్నారు. అయితే వాళ్లిద్దరూ కూడా బాలయ్య క్రేజ్ కి తగినవారు కాదనే ఒక అసంతృప్తి మాత్రం అభిమానుల్లో ఉంది. ఈ సినిమాతో బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.
Must Read ;- బాలయ్య సినిమాకి యంగ్ హీరో నో చెప్పాడా..?