Is Jagan Withdrew The Proposal Of Three Capitals :
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించరాదన్న భావన నుంచి సీఎం వైఎస్ జగన్ క్రమంగా తన వైఖరిని మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎంపిక చేసిన అమరావతిలో అంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని, రాజధానిలో భూములన్నింటినీ ఆ వర్గమే చేజిక్కించుకుంందని తనదైన శైలి సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. అమరావతిని కేవలం శాసన రాజధానికి పరిమితం చేసేసి.. పరిపాలనా రాజధానిని విశాఖకు, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలించే దిశగా యమా స్పీడుగా అడుగులు వేశారు. అయితే ఈ దిశగా జగన్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. ఓ వైపు నుంచి అమరావతి నిర్మాణం బంగారం పండే పంట పొలాలను ఇచ్చిన రాజధాని రైతులు నాన్ స్టాప్ గా నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మూడు రాజధానులపై తొలుత శాసనమండలిని కేంద్రంగా చేసుకుని టీడీపీ తిప్పికొట్టగా.. ఆ తర్వాత కోర్టుల్లోనూ జగన్ సర్కారుకు ఎదురు దెబ్బలే తగిలాయి. ఇక కరోనా జగన్ స్పీడుకు ఏ మేర బ్రేకులు వేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా విశాఖ మునక ఖాయమేనంటూ నాసా ఓ సంచలన నివేదికను విడుదల చేసింది. ఇలా వరుసపెట్టి బ్రేకులు పడుతున్న నేపథ్యంలో జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను అటకెక్కించినట్టుగానే చెబుతున్నారు.
ఇదే నిదర్శనం
అమరావతిలో కొనసాగుతున్న ఏపీ హైకోర్టు భవనాన్ని విస్తరించడానికి జగన్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనల్ని అంగీకరించేందుకు మొన్నటిదాకా ససేమిరా అన్న ప్రభుత్వం ప్రభుత్వం తాజాగా హఠాత్తుగా ఆమోదించింది. రూ.29.40 కోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు భవనం కార్యకలాపాలకు సరిపోవడం లేదు. దీన్ని విస్తరించాలన్న ప్రతిపాదనలు మొదటి నుంచి ఉన్నాయి. 14 కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని కొత్తగా చేపట్టనున్నారు. అయితే న్యాయరాజధానిని కర్నూలుకు తరలించాలన్న ఉద్దేశంతో ఇంత కాలం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటుగా వెనువెంటనే నిధులు విడుదల చేసిన తీరు చూస్తుంటే.. మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ సర్కారు పక్కన పెట్టేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు భవనం కాదు. దాన్న జిల్లా కోర్టుగా వినియోగించుకుంటారు. అసలు హైకోర్టు భవనానికి డిజైన్లు ఖరారు కావడం ఆలస్యం కావడంతో ముందుగా ఈ భవనాన్ని శరవేగంగా నిర్మించారు. ఈ కారణంగానే ఇప్పుడు విస్తరణ పనులు చేపడుతున్నారు.
ఆ ప్రసంగంలోనూ లేదుగా
ఇదిలా ఉంటే.. జగన్ తీరును అతి దగ్గరి నుంచి గమనిస్తున్న వారంతా.. జగన్ ఎప్పుడో మూడు రాజధానుల ప్రతిపాదనలను పక్కనపెట్టేశారని చెబుతున్నారు. ఎప్పుడు బహిరంగ సభలకు వచ్చినా, అసెంబ్లీలో మాట్లాడినా మూడు రాజధానుల ప్రతిపాదనను తప్పనిసరిగా ప్రస్తావించే జగన్.. అనూహ్యంగా మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అంశాన్నే ప్రస్తావించలేదు. స్వాతంత్య్ర దినోత్సవాన జగన్ చేసిన కీలక ప్రసంగంలో మూడు రాజధానుల మాటే వినిపించలేదు. అంటే.. అప్పటికి చాలా రోజుల ముందు నుంచే మూడు రాజధానుల అంశాన్ని జగన్ అటకెక్కించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో రాజధానుల అంశాన్ని ప్రస్తావించకుండా మెలగిన జగన్.. కేవలం రోజుల వ్యవధిలోనే హైకోర్టు భవన విస్తరణకు నిధులు కూడా మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జగన్ ఇక రాజధానిని అమరావతిలోనే కొనసాగించేందుకు ఫిక్స్ అయిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అన్నీ అపశకునాలే.. అమరావతికి ఇబ్బందే లేదు