Box Office Fight Between Acharya And Akhanda Movies :
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. ఈ నెలాఖరు నాటికి షూటింగు పార్టును పూర్తి చేయనున్నారు. ఆ తరువాత ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి, సెప్టెంబర్ నుంచి ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలా ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాలో కథానాయకుడు పాఠాలు చెప్పే ఆచార్యుడు కాదు, గుణపాఠాలు చెప్పే ఆచార్యుడు అంటూ, ఈ సినిమాపై కొరటాల మరింత ఆసక్తిని రేకెత్తించారు. ఈ సినిమాలో చిరంజీవి – చరణ్ నక్సలైట్స్ గా ఒకేసారి తెరపై కనిపించనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు కాజల్ తో చిరూ .. పూజ హెగ్డేతో చరణ్ రొమాన్స్ కూడా ఫ్యాన్స్ లో కుతూహలాన్ని పెంచుతోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బాలయ్య ‘అఖండ‘ కూడా ముస్తాబవుతోంది.
బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో ‘అఖండ‘ రూపొందుతోంది. ఈ సినిమా కూడా చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. ఈ నెలలోనే క్లైమాక్స్ చిత్రీకరణ జరిపి, షూటింగు పార్టును పూర్తి చేయనున్నారు. ఆ తరువాత మిగతా పనులను చకచకా కానిచ్చేసి దసరా బరిలోకి దింపాలనే చూస్తున్నారు. గతంలో దసరా బరిలో నిలిచిన బాలయ్య సినిమాలు భారీ విజయాలను అందుకోవడం కూడా ఒక సెంటిమెంట్ గా మారింది. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న అఘోర రోల్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. తమన్ సంగీతం ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. రెండు బ్లాక్ బస్టర్ల తరువాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి. ఇలా అటు ‘ఆచార్య’ .. ఇటు ‘అఖండ’ దసరా దిశగా అడుగులు వేస్తూ ఉండటంతో, అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
Must Read ;- చిరంజీవి.. ఆచార్య తర్వాత చేసేది లూసీఫర్ రీమేకా..? బాబీ మూవీనా..?