అటు కరోనా.. ఇటు కొత్తరకం స్ట్రెయిన్‌తో బ్రిటన్ ప్రజలు వణికిపోతున్నారు. రెండూ ఏమాత్రం తగ్గం అన్నట్లు ఒకదానితో ఒకటి పోటీపడుతూ మరీ బ్రిటన్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని అదుపుచేయడానికి ప్రభుత్వం కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఓవైపు లాక్ డౌన్.. మరోవైపు వ్యాక్సిన్.. ఇలా ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతూ కరోనా కొమ్ములు వంచడానికి ప్రయత్నిస్తుంది. బ్రిటన్‌లో ఇప్పటికే 1.5 మిలియన్ల మందకి టీకాలు వేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ జాబితాలో బ్రిటన్ రాజ వంశీకులు కూడా చేరారు.
బ్రిటన్ రాణికి వ్యాక్సిన్
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II (94), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ (99)లు శనివారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ అధికారక ప్రకటన విడుదల చేసింది. ‘క్వీన్ ఎలిజబెత్, డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ (ప్రిన్స్ ఫిలిప్) ఈ రోజు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు’ అని ప్యాలెస్ అధికారిక ప్రతినిధి తెలిపారు. వారి నివాసమైన విండ్‌సోర్ క్యాస్టెల్‌లో పర్సనల్ డాక్టర్ వారికి టీకా ఇచ్చినట్టు ఒక ప్రకటనను విడుదల చేశారు. అయితే, టీకా తర్వాతి వారి ఆరోగ్య సమాచారం గురించి ఎటు ప్రకటన లేదు.
మరణాల శాతంలో మార్పులేదు..
లాక్ డౌన్.. టీకా.. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. లండన్‌లో వేల కొలది కొత్త కేసులు నమోదవడంతో పాటు మరణాలకు అడ్డుకట్ట పడకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ తొలి విడతలో భాగంగా వృద్ధులు, వారి సంరక్షులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారికి 80 వేల మంది బలయ్యారు. అలాగే, 68,053 కొత్త కేసులు నమోదయ్యాయి.
Must Read ;- కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న బాలీవుడ్ నటి