నితిన్ కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రంగ్ దే’ సినిమా రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 26వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. “బస్టాండే బస్టాండే ఇక బతుకే బస్టాండే .. ‘ అంటూ ఈ లిరికల్ సాంగ్ సాగుతోంది. పెళ్లయితే అప్పటివరకూ రంగురంగులతో కనిపించే లోకం చీకట్లోకి జారిపోతుంది .. సింపుల్ గా సాగే జీవితంలో నుంచి నవ్వులు – కలలు మాయమైపోతాయి అనే అర్థంలో ఈ పాట నడుస్తుంది.
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరించిన ఈ పాటను సాగర్ ఆలపించాడు. తేలికైన పదాలతో శ్రీమణి అందించిన సాహిత్యం బాగుంది. ఈ కాలం కుర్రాళ్లకు ఎక్కేలానే ఈ పాట ఉంది. శేఖర్ మాస్టర్ – గాయత్రి రఘురామ్ అందించిన కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. ఇక పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నితిన్ జోడీగా కీర్తి సురేశ్ తొలిసారిగా నటించిన సినిమా ఇది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందనే అనిపిస్తోంది. ఈ జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆత్రుతను కనబరుస్తున్నారు.
నితిన్ నుంచి రీసెంట్ గా వచ్చిన ‘చెక్‘ యావరేజ్ మార్కులు తెచ్చుకుంది. దాంతో నితిన్ అభిమానులు ‘రంగ్ దే’ సినిమాపైనే దృష్టిపెట్టారు. ఇక ‘మహానటి’ తరువాత కీర్తి సురేశ్ కి ఇంతవరకూ ఇక్కడ సరైన హిట్ పడలేదు. అందువలన ఈ సినిమా హిట్ ఆమెకి కూడా చాలా అవసరమే. ‘మిస్టర్ మజ్ను‘వంటి ఫ్లాప్ తరువాత వెంకీ అట్లూరి చేసిన సినిమా కావడం వలన, సక్సెస్ కోసం ఆయన కూడా వెయిటింగ్. ఇంతమంది ఆశలు పెట్టుకున్న ‘రంగ్ దే’ నిజంగానే రంగులు తెస్తుందేమో చూడాలి.
Must Read ;- ‘రంగ్ దే’ షూటింగ్ పూర్తి.. రిలీజ్ అప్పుడే