యన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి అగ్ర తారలు టాలీవుడ్ లో రాజ్యమేలుతోన్న కాలంలో .. వారి సినిమాలు నెల, రెండు నెలల తేడాతో వరుసగా విడుదలయ్యేవి. రోజుకు మూడు షిష్టుల్లో పనిచేయడం వల్ల ఆ హీరోల నుంచి అత్యధిక సంఖ్యలో సినిమాలు విడుదలయ్యేవి. అలాగే తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లు కూడా అలాగే తమ సినిమాల్ని విడుదల చేసేవారు. ఒకో హీరో నుంచి సంవత్సరానికి యావరేజ్ గా ఐదారు సినిమాలు విడుదలయ్యేవి. దాని వల్ల ఇండస్ట్రీ లో పలువురి ఉపాధికి ఎలాంటి లోటూ ఉండేది కాదు.
కానీ ఈ జెనరేషన్ హీరోలు ఏడాదికి గట్టిగా రెండు సినిమాలు కూడా విడుదల చేయలేని పరిస్థితి. అయితే లాక్ డౌన్ పుణ్యమా అని .. ఇప్పుడు టాలీవుడ్ లోని చిన్న పెద్ద హీరోలు.. తమ సినిమాల్ని వరుసగా లైన్ లో పెడుతూ.. నెల, రెండు నెలల గ్యాప్ తో తమ సినిమాల్ని విడుదల చేసే వాతావరణం కనిపిస్తోంది. సీనియర్ హీరో వెంకటేశ్ నారప్ప, ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాల్ని ఈ ఏడాదే విడుదలయ్యే ప్లాన్ చేస్తుండగా.. రవితేజ కూడా తమ తదుపరి చిత్రం ‘ఖిలాడి’ ని కూడా ఇదే ఏడాది విడుదల చేయబోతున్నాడు. ఈ సినిమా మే 28న విడుదల కాబోతోంది.
ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా అదే పాట్రన్ ను ఫాలో అవుతున్నాడు. నితిన్ తాజా చిత్రం ‘చెక్’ ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది. అలాగే.. అతడి మరో సినిమా ‘రంగ్ దే’ సరిగ్గా నెల రోజుల గ్యాప్ తో అంటే.. మార్చ్ 26న విడుదల కాబోతోంది. అలాగే అతడు నటిస్తోన్న బాలీవుడ్ ‘అంధాధున్’ రీమేక్ మూవీ కూడా ఇదే ఏడాది విడుదల కాబోతోంది. ఈ రేంజ్ లో ఇదివరకు మన హీరోలు .. ఇంత ఫాస్ట్ గా తమ సినిమాల్ని విడుదల చేయకపోవడంతో .. ఇది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Must Read ;- ‘చెక్’తో నిజమైన నటన నేర్చుకున్నాను: నితిన్











