దేశంలో కరోనా వేగానికి బ్రేకులు పడ్డాయి.మే 9వ తేదీన గరిష్ఠ స్థాయికి చేరిన కరోనా కేసులు గత వారం రోజుల నుంచి వేగంగా తగ్గుతున్నాయి.మే 9న గరిష్ఠంగా ఒక్క రోజులో 4.17వేల కోవిడ్ కేసులు నమోదు కాగా, నిన్న 2.89 లక్షలకు కేసులు తగ్గినా మరణాలు తగ్గటం లేదు.గడచిన వారం రోజుల్లో లక్షకుపైగా కేసులు తగ్గాయి.నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 3.11 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఇది కొంత ఉపశమనం కలిగించే అంశమే. 16 రాష్ట్రాలు లాక్ డౌన్ వేయడం,మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలు,కఠిన ఆంక్షలు విధించడంతో కరోనా వేగానికి బ్రేకులు పడ్డాయి.మరో నెల రోజుల్లో దేశంలో కరోనా కేసుల సంఖ్య 10వేలకు తగ్గవచ్చనే అంచనాలు ఊరట నిస్తున్నాయి.
ఆ ఏడు రాష్ట్రాల్లోనే..
దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 70 శాతం ఏడు రాష్ట్రాల్లోనే వస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి వెల్లడించారు.కర్ణాటక,మహారాష్ట్ర,యూపీ,బెంగాల్,తమిళనాడు,ఏపీ,కేరళ రాష్ట్రాల్లో సగటున రోజుకు 24 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయని తేలింది.దాదాపు 180 జిల్లాల్లో కరోనా కేసులు వంద లోపే ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.దేశంలో సగటున పాజిటివిటీ రేటు కూడా 24 నుంచి 16 శాతానికి దిగి వచ్చింది.అయితే గోవాలో 40 శాతం, ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 24 శాతం పాజిటివిటీ రేటు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఆ ఏడు రాష్ట్రాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.కరోనా వేగానికి బ్రేకులు వేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రధాని మోడీ ఆదేశించారు.
వ్యాక్సినేషన్ వేగవంతం..
దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు,వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.ఇప్పటికే దేశంలో 20.23 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్టు కేంద్రం ప్రకటించింది.మరో 2 కోట్ల వ్యాక్సిన్లు రాష్ట్రాల వద్ద ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.దేశంలో ఇప్పటికే రెండు కంపెనీలు నెలకు12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తుండగా,తాజాగా రష్యా సహకారంతో డాక్టర్ రెడ్డీస్ స్పుత్నిక్ టీకా ఉత్పత్తిని త్వరలో ప్రారంభించనుంది.రష్యా నుంచి కూడా 3 లక్షల స్పుత్నిక్ టీకాలు దిగుమతి చేసుకున్నారు.ఇలా అందుబాటులో ఉన్న టీకాలతో పాటు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడంతో పాటు,దేశీయ టీకాలను మరికొన్ని ఫార్మా పరిశ్రమల్లో కూడా పెద్ద ఎత్తున తయారు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.ఇలా ప్రతి నెలా కనీసం 20 కోట్ల టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీలో తగ్గని కరోనా వేగం..
ఏపీలో కరోనా వేగం ఏ మాత్రం తగ్గలేదు.13 రోజులుగా ఏపీలో కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చినా కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుదల నమోదవుతోంది.నిన్న ఒక్క రోజే ఏపీలో 24 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఏపీలో 2.8 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.15 లక్షల మంది కరోనా భారి నుంచి బయటపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది.నిన్న ఒక్కరోజే కరోనాకు చికిత్స పొందుతూ101 మంది చనిపోయారు.మొత్తం మీద ఇప్పటికే ఏపీలో కరోనా కాటుకు 9,329 మంది బలయ్యారు.కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వ కర్ఫ్యూను నెలఖరు వరకు పొడగించింది.ఇక తూర్పుగోదావరి జిల్లాను కరోనా వణికిస్తోంది.నిన్న ఒక్క రోజే తూ గోలో 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 40 శాతంపైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో తగ్గిన ఉధృతి..
తెలంగాణలో కరోనా వేగానికి బ్రేకులు పడ్డాయి.నిన్న తెలంగాణలో 3 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.దీంతో వైద్యాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి తీసుకువచ్చాక కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి.మరో పక్షం రోజుల్లో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వెయ్యి లోపునకు తగ్గవచ్చని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది.అయితే బ్లాక్ ఫంగస్ కలవరం రేపుతోంది.ముందు మహారాష్ట్రలో వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ తాజాగా తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 మంది బ్లాక్ ఫంగస్ భారినపడి చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ అనుమానాలు ఉండే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వైద్యులను ఆదేశించారు.
Must Read ;- ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు ముగ్గురి మృతి