అదో కాలరాత్రి. అంతటి దారుణాన్ని ఊహించని ఒక అమాయకురాలు నలుగురు మృగాళ్ల చేతిలో దారుణహత్యకు గురైంది. ఈ సంఘటన హైదరాబాద్ లో ఏడాది క్రితం వెలుగులోకి వచ్చింది. కేవలం తెలంగాణ రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కదిలించి వేసింది. మౌనం వీడి దిశకు న్యాయం కావాలంటూ యువత రోడ్లెక్కారు. అంతేకాదు, ఎన్నో కొత్త చట్టాల రూపకల్పనకు దారి తీసింది ఈ ఘటన . మరి దిశ సంఘటన పరిణామాలు చూద్దాం రండి…
కాలరాత్రి
2019, నవంబర్ నెల, చర్మ సమస్య చికిత్స కోసం గచ్చిబౌలి వెళ్లిన వెటర్నరి డాక్టర్ తొండుపల్లి టోల్ ప్లాజా అవతల స్కూటీని నిలిపి తన పని పూర్తిచేసుకుని తిరిగి రాత్రి 9 గంటల సమయంలో అదే ప్రాంతానికి చేరుకుంది. కానీ పంక్చరైన బైక్ ని రిపేర్ చేయించే నెపంతో నలుగురు మానవ మృగాళ్లు దిశ పై అఘాయిత్యానికి పాల్పడి, ఆమెను సజీవ దహనం చేశారు. ఫిర్యాదు చేసినా, నిర్లక్ష్యం వహించారని పోలీసులు విమర్శల పాలవడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగిన నెల లోపలే ఆ నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో మరణించడం గమనార్హం.
వెలసిన ‘దిశ’ పోలీస్ స్టేషన్లు
ఒక సంఘటన జరిగిన వెంటనే దానికి నివారణ చర్యల పేరుతో చట్టాలు చేయడంలో మన ప్రభుత్వాలు ముందుంటాయి. ‘దిశ’ పేరుతో కొత్త చట్టాలు చేశారు. ఏపీ లో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు సైతం వెలిశాయి. కానీ, దాని వల్ల ఉపయోగం ఎంత శాతం ఉందని పోల్చకుంటే నిరాశే మిగులుతుంది. కఠిన చట్టాలు చేశాం అని డప్పు కొట్టుకుంటున్న ప్రభుత్వాలు, తిరిగి మళ్లీ అలాంటి సంఘటనలు జరుగుతున్నా కూడా అనుకున్న స్థాయిలో సత్వర స్పందన, న్యాయం జరగట్లేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. మళ్లీ ఏదైనా సంఘటన సంచలనమైతే, ఆ పేరుతో ఏదో ఒకటి చేయడానికి అన్నట్లుగా తయారైంది ప్రభుత్వ తీరు.
Also Read ;- ఏపీలో జీరో ఎఫ్.ఐ.ఆర్ అమలవుతోందా?
కదిలిన ఢిల్లీ కేసు
దిశ సంఘటన వల్ల జరిగిన మేలేదన్నా ఉందంటే అది నిర్భయ కేసు ఒక కొలిక్కి రావడం అని చెప్పచ్చు. నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష పడినా కూడా దాని అమలు గురించి పట్టించుకున్నవారు లేరు. ఒక రకంగా దిశ ఘటనతో నిర్భయకు న్యాయం జరిగినట్లుంది. అప్పటి వరకు నిశబ్దంగా ఉన్న నిర్భయ కేసు తిరిగి పుంజుకుంది. వాదోపవాదాలు, వాయిదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా కొనసాగి చివరికి మార్చి 20 వ తేదీన నిందితులకు ఉరి బిగుసుకుంది. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. దేశమంతా హార్షం వ్యక్తమైంది.
సంచలనమైతేనే చర్యలా
మన దిశ లాంటి ఘటనలు ఎన్నో నమోదు అవుతున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే సంచలనమవుతున్నాయి. అలా సంచలనమైన కేసులకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. అలాంటి వారి పేర్లు పెట్టి చట్టాలు చేసి చేతులు దులుపుకుంటుంది. మరి మిగిలిన వారివి ప్రాణాలు కావా? వారికి న్యాయం అవసరం లేదా? కేసు కోర్టులో నడుపుకుంటూనే జీవిత కాలం గడిపేయచ్చులే అనే నిర్ణక్ష్య ధోరణి నిందితుల్లో ఉండకూడదంటే, ఇలాంటి కేసుల్లో కావల్సింది సత్వర న్యాయం, వెంటనే అమలయ్యే శిక్షలు.
Must Read ;- ఆందోళన కలిగిస్తున్న డ్రగ్ కల్చర్.. విద్యార్థులే టార్గెట్