వైసీపీ నాయకులపై దాడి చేశారని ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి అరెస్టు అయిన విషయం విధితమే. పోలీసుల అదుపులో ఉన్న జనార్దన్ రెడ్డికి మంగళవారం బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో అదోని సబ్ జైలు నుంచి బీసీ జనార్దన్ రెడ్డి రిలీజ్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి కూడా బెయిల్ మంజూరు అయ్యింది.
అసలు ఏం జరిగిదంటే?
గత నెలలో ఎమ్మెల్యే కాటసాని అనుచరుడు, వైసీపీ కార్యకర్త కోణేటి దుర్గాప్రసాద్‌పై జనార్దన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ తో పాటు, మరికొందరికి గాయాలైనట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ముఖ్య నేత జనార్ధన్ రెడ్డిని పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీసీ జనార్దన్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు ఐపీసీ 307, 147, 148, 324, 341, 3 క్లాస్ 1, సెక్షన్లతో కేసులు పెట్టారు. వాస్తవానికి ఆ రోజు బీసీ జనార్దన్ రెడ్డి ఇంటిపైనే వైసీపీ దాడికి దిగినట్లుగా టీడీపీ చెబుతోంది. తన ఇంటిపై దాడికి దిగిన వారిని అడ్డుకునే యత్నంలో భాగంగా బీసీ తన ఇంటి నుంచి బయటకు రాగా… జనార్దన్ రెడ్డే తమపై దాడికి దిగారని వైసీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో టీడీపీ వాదనలను ఎంతమాత్రం పట్టించుకోని పోలీసులు బీసీపైనే కేసులు పెట్టేసి… వైసీపీ నేతలపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.

దేనికైనా రె‘ఢీ’
కర్నూల్ జిల్లాలోనే బీసీ జనార్ధన్ రెడ్డికి మంచి పేరుంది. టీడీపీలో బలమైన నేత కూడా. పార్టీ అధిష్ఠానం ఏ చిన్న పిలుపు ఇచ్చినా స్పందించే నేతగా పేరుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ముందుండేవారు. తిరుపతి ఉప ఎన్నికలోనూ తనవంతుగా ప్రచారం చేశారు. బీసీని ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావించిన జగన్ ప్రభుత్వం.. వైసీపీ నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో జనార్ధన్ రెడ్డిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకుంది. ముప్పు తిప్పలు పెట్టింది. అయినా బీసీ బెదరలేదు. ఈ విషయమై జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ.. వైసీపీలో చేరనందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. టీడీపీ నాయకులు పల్లా శ్రీనివాస్, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర లాంటి బలమైన నాయకులపై కేసులు పెట్టి టీడీపీ దెబ్బ కొట్టాలని భావించింది. అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, తాడోపేడో తేల్చుకుంటామని తేల్చి చెప్పడంతో జగన్ సర్కార్ అక్రమ కేసులకు పరిమితమవుతూ.. రాక్షస ఆనందం పొందుతుందని పలువురు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Must Read ;- కుటిల యత్నంతో కూల్చివేతలు.. టీడీపీ నేతల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా..











