ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సరికొత్త అథారిటీ ఏర్పాటు కాబోతున్నది. ఇది ప్రభుత్వపు సొంత ఆలోచన ఎంతమాత్రమూ కాదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఆదేశాలు వచ్చిన ఆరునెలల తర్వాత జరుగుతున్న ఏర్పాటు. ఆ సరికొత్త అథారిటీ పేరు ‘పోలీసు కంప్లయింట్ అథారిటీ!’ పోలీసు వ్యవస్థపై వచ్చే ఫిర్యాదులను విచారించడానికే ఈ కమిటీ ఏర్పడుతున్నట్లు ప్రకటించారు. అదనపు ఎస్పీ అంతకంటె పైస్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను ఇది పరిశీలిస్తుందనేది అధికారిక ఏర్పాటు! ప్రతి రాష్ట్రం ఇలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా గతంలో సుప్రీం కోర్టు సూచించింది. ఆ మేరకు ఆరునెలల కిందటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కూడా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తాజాగా ఈ వ్యవస్థ ఏర్పాటును ప్రారంభించింది. రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ ను దీనికి ఛైర్మన్ గా నియమించింది. తతిమ్మా ఏర్పాటు త్వరలో పూర్తి చేస్తారు.
ఈ అథారిటీ పోలీసు ఉన్నతాధికారులపై ఫిర్యాదులోతో పాటు, కస్టడీలో మరణం, దాడి, అత్యాచారం వంటి సంఘటనల సమయంలో పోలీసుల ప్రవర్తనపై వచ్చే ఫిర్యాదులను కూడా విచారిస్తుందనేది దాని ఏర్పాటు వెనుక లక్ష్యం.
అధికార పార్టీకి అనుకూలంగా ఖాకీలు
అయితే, పోలీసు యంత్రాంగం యావత్తూ.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుయాయులుగా మారిపోతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్న వేళ.. ఇలా పోలీసులపై వచ్చే ఫిర్యాదులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతీగతీ ఉంటుందా? అనేదే ఈ సమయంలో ఎదురవుతున్న అతిపెద్ద ప్రశ్న. రాష్ట్రంలో కిందిస్థాయి కానిస్టేబుల్, హోంగార్డుల నుంచి.. అత్యున్నత స్థాయిలో ఉండే డీజీపీ వరకు ప్రతి స్థాయిలోని అధికారుల మీద కూడా రాజకీయ విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. ఏ స్థాయిలోని వారు.. ఆ స్థాయిలోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నారని.. అధికార పార్టీ కార్యకర్తల్లాగానే పనిచేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల పట్ల కక్షపూరిత ధోరణులతో వ్యవహరిస్తున్నారని అనేక విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క విమర్శను కూడా ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. పైపెచ్చు.. తెలుగుదేశానికి చెందిన నాయకులు ఏ చిన్న కార్యక్రమం, ధర్నా, ర్యాలీ చివరికి పరామర్శ వంటిది చేసినా కూడా.. దానికి కొవిడ్ ఉల్ఘంఘనల ముసుగు వేసి.. తక్షణం కేసులు పెట్టేస్తున్నారు.
ప్రజలు అవివేకులేమీ కాదుగా
అదే సమయంలో.. అధికార పార్టీ వాళ్లు ఎంత ఘోరంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఎంత మందితో కార్యక్రమాలు చేసినా.. వాటిని పట్టించుకునే దిక్కు లేదు. ప్రత్యేకించి ప్రతిపక్షాలు విమర్శలు కురిపించకపోయినా సరే.. అధికార పార్టీకి అనుకూలంగా, విపక్షాల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఇలాంటి ధోరణిని ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా గమనిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారాలపై వచ్చే విమర్శలన్నిటికీ తెలుగుదేశం రంగు పూసేసి.. ప్రజలను మభ్యపెట్టగలం అని ప్రభుత్వం అనుకోవచ్చు గాక.. కానీ ప్రజలు అవివేకులు కాదు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసేసి, తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నదో, వారిని ఎలా తమ తొత్తుల్లా వాడుకుంటున్నదో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేకంగా.. పోలీసుల మీద ఫిర్యాదులకు ఈ పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేసినా.. దాని పనితీరు ఎలా ఉంటుందో ప్రజలు ఊహించుకోగలరు. జగన్ జమానాలో నిర్వీర్యంగా పడి ఉండే మరొక వ్యవస్థ మాత్రమే అవుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
అన్నీ ప్రశ్నలే
ఈ పీసీఏకు అసలు ఎవరు ఫిర్యాదు చేస్తారు? తెలుగుదేశం నాయకులు పోలీసు అధికార్లపై ఫిర్యాదు చేస్తే పీసీఏ పట్టించుకుంటుందా? తెలుగుదేశం మహిళా నాయకులు వేధింపులకు గురవుతూ దిశ చట్టం కింద ఫిర్యాదు చేస్తేనే పట్టించుకుంటున్న దిక్కు లేదు. అలాంటి తెలుగుదేశం నాయకులు పోలీసుల వైఖరిపై ఫిర్యాదు చేస్తే ఈ పీసీఏ మాత్రం పట్టించుకుంటుందా? పట్టించుకుంటే తప్ప ఇలాంటి రిటైర్డు న్యాయమూర్తి ఆధ్వర్యంలో పనిచేసే ఒక స్వతంత్ర వ్యవస్థ.. నిజంగానే స్వతంత్రంగా పనిచేస్తుందనే అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడం కష్టం!
Must Read ;-జస్టిస్ కనగరాజ్ బాటలో సాహ్ని కూడా ఔటేనా?