రానున్న కాలంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా స్పీడు అవుతారా.. వ్యవస్థల్లోకి చొరబడి మరీ ప్రజస్వామ్యాన్ని శాసిస్తారా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు సారాంశాన్ని బట్టి చూస్తే అవుననే అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. రానున్న కాలంలో జగన్ మరింత స్పీడు అవుతాడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఘటనలు, పరిస్థితులను బట్టి చూస్తే.. కలియుగం అంతం కాబోతున్నదని జగనన్న చెబుతున్నారని, కాబట్టి మున్ముందు మరింత దారుణంగా ఉండవచ్చని కొత్త పలుకులో వ్యాఖ్యానించారు ఏబీఎన్ ఆర్కే. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా ఎన్నుకోబడవలసిన సంస్థలలోకి మరో రూపంలో చొరబడుతున్న వాళ్లు అధికారం చెలాయించడం కూడా కలియుగ ధర్మమే కాబోలు అని రాశారు.
జగన్ పాలనలో కొత్త నిర్వచనాలు
అంతేకాదు.. కలిపురుషుడు చెప్పిన అంశాలను తెరపైకి తెచ్చిన ఆర్కే.. ప్రస్తుతం జగన్ పాలనలో కొత్త నిర్వచనాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. మంచితనం అంటే చేతగాని తనమని, నమ్మకద్రోహమే తెలివి అని, కష్టపడడం అంటే వెర్రితనమని, ధర్మరక్షణ అంటే చాదస్తం, వాక్చాతుర్యం అంటే మాయమాటలు చెప్పడం, చిరునవ్వంటే ఎగతాళి చేయడం అని అర్థం చేసుకునే పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల మొదలు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వరకు ప్రస్తావించారు. ఇందుకు సరిగ్గా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి కామెంట్లు కూడా సరిపోతాయన్న చర్చ నడుస్తోంది. తమ సీఎం జగన్ పెద్ద మనస్సున్నవారు కాబట్టి..టీడీపీలో ఆ మాత్రం ఎమ్మెల్యేలు ఉన్నారని, అదే తాను సీఎం అయితే టీడీపీలో చంద్రబాబు మాత్రమే మిగులుతాడని వ్యాఖ్యానించారు. దీంతో తనకంటే జగన్ మంచివాడనే చర్చ మొదలు పెట్టినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి.
ఇక వాక్చ్యాతుర్యం విషయానికి వస్తే.. గతంలో ప్రతిపక్షంలో వైసీపీ ఉన్న సమయంలో ప్రత్యేక హోదా విషయంలో పెద్ద రచ్చే చేసింది. ఎంపీలమందరం కలిసి రాజీనామాలు చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదని ప్రశ్నించింది. అయితే తాజాగా ఆ పార్టీ నాయకులు విశాఖ స్టీల్ విషయానికి వచ్చేటప్పటికి రాజీనామాలు చేస్తే ఏం వస్తుందని, మీరే గౌరవించరని, పోరాడి సాధించాలని చెప్పుకొచ్చారు. మరి గతంలో రాజీనామాలు, భారీ సవాళ్లు, మెడలు వంచుతామనే నినాదాలు చేసినవారే..ఇప్పుడు అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మాత్రం రాజీనామాలు చేసేందుకు ముందుకు రావడం లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ప్రత్యేక హోదా విషయంతో పాటు పలు అంశాలు దైవాదీనాలుగా ప్రభుత్వ ముఖ్యులు చెప్పడం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది.
Must Read ;- ఏపీ బీజేపీ సారథే ‘జగన్ ’ బ్యాచీ అని చెప్పిన ఏబీఎన్ RK
నిందలన్నీ పాత ప్రభుత్వాలపై..
అంతేకాదు.. ఏబీఎన్ ఆర్కే ఇక్కడే మరో అంశాన్ని విస్మరించారు కూడా. రాజకీయ ప్రసంగాలంటే.. కేవలం ప్రతిపక్ష నాయకులపై బూతుపదాలతో రెచ్చిపోవడం, నిందలన్నీ పాత ప్రభుత్వాలపై వేయడాన్ని ప్రస్తావించలేదు. విశాఖ స్టీల్ ఇష్యూలో ఈ అంశాలను గమనించవచ్చు. అసలు విశాఖ ఉక్కు సంస్థను పోస్కో ప్రతినిధులు సందర్శించడం, ఒప్పదం జరగడం ఇవన్నీ వైసీపీ హయాంలోనే జరిగాయి. అయితే విశాఖ స్టీల్ ఉద్యమం విషయంలోనూ ప్రతిపక్షంపైనే నిందలు వేయడం గమనించవచ్చు.
ఇక చివరి విషయానికి వస్తే.. కలియుగంలో తమకు ఏం కావాలో పాలకులకు బాగా తెలుసు గానీ, ప్రజలకే తమకేం కావాలో తెలియదని కలి పురుషుడు కూడా ఊహించి ఉండడు అని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే..సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. రాష్ట్రంలో ఆదాయ వనరులు, సంపద పెరగడం అవసరం. అవేమీ లేకుండా అప్పులు తెచ్చి పంచిపెట్టడం ప్రస్తుతానికి బాగానే ఉన్నా రానున్న కాలంలో ప్రజలే ఇబ్బందుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వైసీపీకి అధికారం కావాలి.. ఆ విషయం వైసీపీకి తెలుసు. కాని ప్రజలకు ఏం కావాలో తెలియదని ఆర్కే కామెంట్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే.. మాట తప్పను..మడమ తిప్పను అన్న జగన్ సర్కారు వాస్తవ పరిస్థితిలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పవచ్చు.
Also Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా