రాజకీయ నేతలన్నాక కాస్తంత సహనం ఉండాలి. ప్రజా ప్రతినిధులయ్యాక ఆ సహనం మరింత పెరగాలి. ఇక మంత్రులుగా బాధ్యతలు చేపడితే.. నోటిని తప్పనిసరిగా అదుపులో పెట్టుకోవాలి. అలా కాదు.. మంత్రులమైనా మేము కూడా మనుషులమే కదా.. మాకూ కోపతాపాలు వస్తాయి కదా అంటే మాత్రం.. ఇప్పుడు ఒకప్పుడు మహారాష్ట్రకు సీఎంగా వ్యవరించి ఇప్పుడు కేంద్ర మంత్రిగా పదవి వెలగబెడుతున్న నారాయణ్ రాణేకు పట్టిన గతే పడుతుందని చెప్పక తప్పదు. మహారాష్ట్ర సీఎం ఉధ్దవ్ ఠాక్రే చెంప చెళ్లుమనిపించే వాడిని అంటూ నారాయణ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రను కుదిపేస్తున్నాయి. బీజేపీ వర్సెస్ శివసేన పోరు ఉధృతంగా సాగుతోంది. ఏకంగా బీజేపీ కార్యాలయాలపై శివసేన శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. ఓ వైపు ఈ గోల జరుగుతుండగానే.. శివసేన శ్రేణుల ఫిర్యాదులతో రాణేపై ఏకంగా నాలుగు కేసులు బుక్కైపోయాయి. ఆ వెంటనే మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది.
అసలేం జరిగిందంటే..?
ఇటీవలే భారత స్వాతంత్య్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది కదా. ఈ సందర్బంగా మహారాష్ట్ర సీఎం హొదాలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఉద్ధవ్ ఠాక్రే.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఏడాదిని సరిగ్గా చెప్పలేకపోయారట. దీనిపై చాలా ఆలస్యంగా స్పందించిన బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నారాయణ్ రాణే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరం ఏదో ముఖ్యమంత్రికి ఉద్ధవ్ థాకరేకి తెలియకపోవడం సిగ్గుచేటు. ఆ సమయంలో నేను అక్కడుంటే సీఎం చెంప చెళ్లుమనిపించేవాడ్ని’’ అని రాణే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చెవినపడినంతనే శివసేన శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అసలే ఆగ్రహావేశాల్లో తమను మించిన వారు లేరన్నట్టుగా సాగే శివసేన శ్రేణులు.. ఇక సీఎం హోదాలో ఉన్న తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే చెంప చెళ్లుమనిపిస్తామన్న నేతను ఊరికే ఎలా వదిలేస్తారు? ఓ వైపు బీజేపీ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తం చేస్తూనే.. మరోవైపు రాణేపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా రాణేపై ఇప్పటికే నాలుగు కేసులు బుక్కయ్యాయి.
కేంద్ర మంత్రి అరెస్ట్
ఈ గోల అంతకంతకూ పెరుగుతున్న వైనాన్ని పసిగట్టిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణే కీడు శంకించారు. వెంటనే రత్నగిరి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆ వెంటనే మరింత ముప్పుందన్న విషయాన్ని గుర్తించిన రాణే.. నేరుగా బొంబాయి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టే బొంబాయి హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో తెలియదు గానీ.. అప్పటికే మహారాష్ట్ర పోలీసులు రాణేను అరెస్ట్ చేశారు. వెరసి సీఎం చెంప పగులగొడతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రాణే.. ఇప్పుడు కటకటాల వెనక్కెళ్లిపోయారు. బొంబాయి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినా.. రాణే అయితే తాను చేసిన వ్యాఖ్యలకు జైలుకు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.
Must Read ;- నిజమా.. తెలంగాణలో తాలిబాన్ సపోర్టున్నారా?











