హమ్మయ్య కారు కొన్న ఆరేళ్లకు కోర్టు తీర్పు వచ్చేసింది. తమిళ సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ తన హోదాకు తగ్గట్టు లగ్జరీ కారు లేకపోతే ఎలా అనుకున్నారు. ఆ కారు కొనాలన్నా అర్హత కూడా ఉండాలట. లేకపోతే ఆ కంపెనీ కూడా అతనికి కారు అమ్మదు. అదే రోల్స్ రాయిస్ కారు. అత్యంత ఖరీదైన ఈ కారును కొనాలంటే సంపన్నులకు మాత్రమే సాధ్యం. గెదెను కొన్న వ్యక్తికి తాడు కొనడం కష్టం కాదు కదా. కానీ ధనుష్ కు పన్ను కట్టలేకపోయారట. అందులో రాయితీ కావాలంటున్నారు.
సినిమాకి తీసుకునే పారితోషికం తగ్గించమంటే మాత్రం వీరికి స్పందన ఉండదు. చివరికి ఈ విషయం కోర్టు మెట్లు ఎక్కేదాకా వెళ్లింది. ఎట్టకేలకు ఈరోజు తీర్పు వచ్చింది. లగ్జరీ కారు విషయంలో పన్ను కట్టి తీరాల్సిందేనని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇలాంటి తీర్పు ఈ తరహా వ్యక్తులకు చెంపపెట్టు లాంటిదే. పైగా అతన్ని చీవాట్లు కూడా పెట్టింది. విదేశాల నుంచి ఇలాంటి దిగుమతి చేసుకున్న కార్లకు పన్నుకూడా భారీ గానే ఉంటుంది. పన్ను మినహాయింపు కోసం ధనుష్ కారు కొన్న ఏడాదే కోర్టును ఆశ్రయించారు.
తాజాగా మరో పిటిషన్ కూడా వేశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టుకు కోపం వచ్చింది. సామాన్యులే పన్ను కడుతున్నప్పుడు మీలాంటి సెలబ్రిటీలకు కలిగిన నొప్పేంటని ప్రశ్నించింది. ఇంత ఖరీదైన కారును కొనగలిగినప్పుడు పన్ను మినహాయింపు ఎలా అడగ కలుగుతున్నారని నిలదీసింది. ఇప్పటికే తాను 50 శాతం పన్ను చెల్లించానని, మిగిలిన పన్ను ఈ నెల 9న చెల్లిస్తానని ధనుష్ సమాధానమిచ్చారు.
కారు ప్రత్యేకతలేంటి?
మొత్తానికి హైకోర్టు తీర్పు రావడానికి ఆరేళ్ల సమయం పట్టింది. ధనుష్ ఈ కారును ఆరు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇది బ్లాక్ కలర్ కారు. దీని నంబర్ 106. అసలు ఇలాంటి కారు ధనుష్ మామ రజినీకాంత్ వద్ద కూడా లేదు. తమిళనాడు చిత్ర పరిశ్రమలో కేవలం ముగ్గురి దగ్గర మాత్రమే ఈ కారు ఉంది. అందులో ఒకరు దళపతి విజయ్, ఇంకొకరు డైరెక్టర్ శంకర్, మరొకరు సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్. నాలుగో వ్యక్తి ధనుష్ అవుతారు. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు ఇది పెద్ద మొత్తమేమీ కాదు. ఈ కారు వివాదంతో అందరి నోళ్లలోనూ ధనుష్ పేరు నానుతోంది. అప్పుడే పన్ను కట్టేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా అంటున్నారు.
Must Read ;- శేఖర్ కమ్ముల – ధనుష్ మూవీ బడ్జెట్ ఎంత?











