హైదరాబాద్ శివారులో చోటుచేసుకున్న దిశ ఘటనపై తనదైన శైలిలో స్పందించిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తన రాష్ట్రంలో మహిళలపై ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండేలా పకడ్బందీ చట్టాన్ని రూపొందించనున్నామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా రూపొందించిన కొత్త చట్టానికి దిశ అనే పేరు పెట్టారు. ఈ చట్టానికి కేంద్రం నుంచి ఆమోదం ఇంకా లభించలేదు. అయితే ఈలోగానే దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ అంటూ హంగామా చేసిన జగన్ సర్కారు.. రాష్ట్రంలో మహిళలపై నేరాలను సహించేది లేదని గొప్పగా ప్రకటనలు గుప్పించారు. ఈ చట్టంపై జగన్ సర్కారు చిత్తశుద్ధి గానీ, విశ్వసనీయత గానీ ఏ మేర ఉందన్న విషయం జనంలో బాగానే చర్చకు వస్తోంది. అంతేకాకుండా ఈ బిల్లును ఆమోదించాలంటూ డ్రాఫ్ట్ కాపీని కేంద్రానికి పంపి చేతులు దులిపేసుకున్న జగన్ సర్కారు.. అసలు ఆ డ్రాఫ్ట్ ను చట్టంగా రూపొందేలా ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క చర్య కూడా చేపట్టలేదని తాజాగా తేలిపోయింది. ఈ విషయంపై జనానికే కాకుండా వైసీపీ టికెట్లపై ఎంపీలుగా విజయం సాధించిన వారికి కూడా స్పష్టత లేకుండాపోయింది.
అడిగింది వైసీపీ ఎంపీనే..
సరే.. ఇప్పటిదాకా జరిగిందేదో జరిగింది. ఇకనైనా ఈ డ్రాఫ్ట్ ను చట్టంగా రూపుదిద్దే దిశగా చర్యలు ప్రారంభిద్దామని భావించిన వైసీపీ ఎంపీలకు గట్టి షాక్ తగిలింది. తమకు కూడా సమాచారం లేకుండా తమదైన శైలి గుట్టును ప్రదర్శిస్తున్న జగన్ చిత్తశుద్ది తెలిసి ఆ పార్టీ ఎంపీలు నిజంగానే షాక్ తిన్నారు. ఇదెలాగో చూద్దామా? ’’దిశ బిల్లును చట్టంగా మార్చాలని మా పార్టీ ప్రభుత్వం మీకు ఓ ప్రతిపాదన పంపింది కదా. దాని విషయం ఏం చేశారు? అసలు ప్రస్తుతం దాని పరిస్థితి ఏమిటి?‘‘ అంటూ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కేంద్రానికి ఓ ప్రశ్న సంధించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఇతర ప్రశ్నల మాదిరే ఈ ప్రశ్నకు కూడా కేంద్రం స్పందించింది. ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రిప్లై ఇచ్చింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సమాధానమే దిశ చట్టంపై జగన్ సర్కారు చిత్తుశుద్ధి ఏపాటితో తేల్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అభ్యంతరాలకు బదులే లేదట
ఈ సమాధానంలో అజయ్ కుమార్ ఏమని చెప్పారంటే.. ’’ఏపీ ప్రభుత్వం దిశ బిల్లును చట్టంగా ఆమోదించమని మాకు ప్రతిపాదనలు పంపిన మాట వాస్తవమే. అయితే ఆ ప్రతిపాదనలు తమకు అందిన వెంటనే దానిని పరిశీలించి అందులో లెక్కలేనన్ని అభ్యంతరాలను గుర్తించాం. వాటికి వివరణలు పంపాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాశాం. అయితే ఇప్పటిదాకా ఏపీ నుంచి ఆ వివరణపై ఎలాంటి స్పందన లేదు. ఏపీ ప్రభుత్వం నుంచి వివరణ వస్తే గానీ మేం ముందడుగు వేయలేం. ఈ మొత్తం జాప్యానికి ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత‘‘ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రతిష్ఠాత్మకంగా చట్టం రూపొందిస్తున్నామని చెప్పిన జగన్ సర్కారు.. తాము ప్రతిపాదించిన బిల్లుపై అభ్యంతరాలకు కూడా సమాధానం ఇవ్వలేనంత బిజీగా ఉందా? అంటూ జనం నొసలు చిట్లించే పరిస్థితి తలెత్తింది. జనం మాట అటుంచితే.. దీనిపై కేంద్రం రిప్లై చూసి వైసీపీ ఎంపీలే షాక్ తిన్నారని చెప్పాలి. మరి పరిస్తితి ఇలా ఉంటే.. దిశపై జగన్ చిత్తశుద్ది ఏపాటితో ఇట్టే అర్తం చేసుకోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Reed ;- సీబీఐ మారదు.. జగన్‌కు టెన్షన్ తప్పదు











