Vijayasai Reddy Viral Comments On Rayalaseema Lift :
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి చిచ్చు పెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు ప్లానేమిటన్న విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణ ఆది నుంచి కూడా ఈ పథకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కావాలనే చెప్పారో, లేదంటే నోరు జారి మరీ అసలు నిజం బయటపెట్టారో తెలియదు గానీ.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. రాయలసీమ పథకంపై జగన్ ప్లానేమిటన్న విషయాన్ని చెప్పేశారు. గురువారం నాడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీలో తాము తీసుకున్న నిర్ణయాలేమిటన్న విషయంపై మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి.. అలాఅలా చెప్పుకుంటూ సీమ పథకంపై జగన్ ప్లాన్ ను కూడా వెల్లడించేశారు.
పోతిరెడ్డిపాడుపై జగన్ మాట ఇదే
కర్నూలు జిల్లా పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచుతూ గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్ణయం తీసుకున్నప్పుడు.. నాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే వైఎస్సార్ వాటన్నింటినీ పెడచెవిన పెట్టేసి.. కరువు సీమగా ఉన్న రాయలసీమకు నీరివ్వాలంటే.. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచాల్సిందేనని, దీనితో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు. ఆ తర్వాత తెలుగు నేల విభజన, ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంచాయతీ మరింతగా ముదిరిపోయింది. ఇలాంటి క్రమంలో రెండేళ్ల క్రితం ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్.. గుట్టుగా పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని భారీగా పెంచే దిశగా పకడ్బందీ వ్యూహం రచించారు. పోతిరెడ్డిపాడు విస్తరణకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టేసి.. ఏకంగా పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్ట్ పెట్టే దిశగా వడివడిగా అడుగులు వేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పనులపై తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల ఈ పంచాయతీ ఇరు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చునే రగిల్చింది. దీనిపై వివరణ ఇచ్చే దిశగా మొన్నామధ్య ఓ బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. శ్రీశైలంలో 881 అడుగుల మేర నీరుంటేనే పోతిరెడ్డిపాడుకు నీరు వస్తుందని, గడచిన 20 ఏళ్లలో 20 సార్లు కూడా శ్రీశైలానికి పూర్తి స్థాయి నీటి మట్టం రాలేదని, ఇకపైనా శ్రీశైలంలో 881 అడుగుల మేర నీరు వచ్చిన తర్వాతే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకుంటామని ప్రకటించారు.
సాయిరెడ్డి ఏమన్నారంటే..?
అయితే జగన్ నోట నుంచి వచ్చిన ఆ ప్రకటన తప్పని ఇప్పుడు సాయిరెడ్డి తేల్చి చెప్పేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మనగలగాలంటే.. శ్రీశైలంలో ప్రాజెక్టు నీటి మట్టం 800 అడుగులకు చేరగానే.. పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించుకునేందుకు అవకాశం కల్పించాలని కేఆర్ఎంబీని డిమాండ్ చేయనున్నట్లుగా సాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. అంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉద్దేశం.. శ్రీశైలంలో 881 అడుగుల దాకా నీటి మట్టం చేరకుండానే.. సీమకు జలాలను తరలించడమన్న మాట. ఈ మాటను ప్రాజెక్టు పూర్తి కాకుండానే బయటపెడితే.. ఇబ్బందేనని గ్రహించిన జగన్.. 881 అడుగుల వద్దే పోతిరెడ్డిపాడుకు నీరు తీసుకుంటామని చెప్పారు. అయితే జగన్ గుట్టుగా ఉంచిన ఆ మాటను ఇప్పుడు సాయిరెడ్డి రట్టు చేశారు. మరి దీనిపై తెలంగాణ ఏ మేర ఆందోళన వ్యక్తం చేస్తుందో?. తన గుట్టును బయటపెట్టిన సాయిరెడ్డిని జగన్ ఏం చేస్తారో? అన్న దిశగా ఆసక్తికర చర్చ సాగుతోంది.
Must Read ;- దిమాక్ ఉన్నోడు జగన్ వద్ద ఒక్కడూ లేడు











