జస్టిస్ నూతలపాటి వెంకటరమణ..త్వరలో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సీనియార్టీ ప్రకారమే ఈ స్థాయికి వచ్చారా అంటే..కచ్చితంగా కాదనే చెప్పాలి. అందుకు ఆయన ఇచ్చిన తీర్పులను, ఆయన చేసిన ప్రసంగాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. తీర్పులు పౌరుల హక్కులు, బాధ్యతలు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ ప్రతిష్ట.. ఇలా ఎన్నో అంశాలు ఇమిడి ఉండేలా పలు తీర్పులు ఇచ్చారు. పలు సందర్భాల్లో ఆయన చేసిన ప్రసంగాల్లోని కొన్ని అంశాలను పరిశీలిస్తే కూడా ఈ విషయం అర్థం అవుతుంది.
దామోదరం సంజీవయ్య లాంటి నేతలు ఇప్పుడు ఉన్నారా..
ఇటీవలే జస్టిస్ ఎన్వీ రమణ విశాఖలో దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో.. ‘దామోదరం సంజీవయ్య జీవితం, విలువలు, సేవల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అంకితభావం, సామాజిక బాధ్యత, అవినీతి రహిత, పారదర్శక పాలనను అందించిన సంజీవయ్య లాంటి నేతలు ప్రస్తుత సమాజంలో లేకపోవడం బాధాకరం’ అన్నారు. ఈ సందర్భంగా న్యాయ విద్యార్థులకు ఓ ఘటన గురించి చెప్పారు. దామోదర సంజీవయ్యను సీఎం చేసే అంశాన్ని జవహార్‌లాల్ నెహ్రూ పరిశీలిస్తున్న సమయంలో దామోదర సంజీవయ్య వ్యతిరేకులు పలు ఆరోపణలు చేశారు. అవినీతి ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
దీంతో దామోదరం సంజీవయ్యపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు నెహ్రూ తనకు నమ్మకమైన వారిని దామోదరం సంజీవయ్య స్వగ్రామానికి పంపారు. ఆ ఊరి చివర గుడిసెలో ఓ వృద్ధురాలు ఉండడం చూసి సదరు వ్యక్తి ఆమెతో మాట్లాడారు. అప్పటి వరకు ఆమె సంజీవయ్య తల్లి అని ఆ వ్యక్తికి తెలియదు. అంతేకాదు.. మాటల్లో భాగంగా ఓ వృద్ధురాలిని నీ కుమారుడు సీఎం అయితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారట. అందుకు ఓ వృద్ధురాలు మాట్లాడుతూ..నా కుమారుడు సీఎం అయితే తనకు బొగ్గుల పొయ్యి కొనిస్తానన్నాడని చెప్పడంతో ఆ వ్యక్తికి నోట మాట రాలేదు. ఇదే విషయం నెహ్రూకి చెప్పారు సదరు వ్యక్తి. ఇంతకంటే గొప్ప విచారణ అవసరం లేదు అనుకున్న నెహ్రూ మరుక్షణమే దామోదరం సంజీవయ్యను సీఎం చేశారు. ఆయన మరణించినప్పుడు దామోదరం సంజీవయ్య ఆస్తులు మూడే మూడు.. ఆయన దుస్తులు, ఒక ప్లేటు..ఒక గ్లాసు.. అలాంటి నేతలు ఇప్పుడు కనిపిస్తారా’ అని వ్యాఖ్యానించారు.
ప్రమాణాలు పెంచడమే పెండింగ్ కేసులకు పరిష్కారమంటూ..
ఇదే వేదికపై మాట్లాడుతూ దేశంలో 1500 న్యాయ విద్యాసంస్థలు ఉన్నాయని, వీటితో పాటు 23 జాతీయ న్యాయ యూనివర్సిటీల నుంచి ఏటా దాదాపు 1.5 లక్షల విద్యార్థులు న్యాయపట్టా పొందుతున్నారని, అయినా దేశంలో 3.8 కోట్ల మేరకు పెండింగ్ కేసులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రమాణాలు పెంచడమే ఇందుకు పరిష్కారమని, అందుకు న్యాయవ్యవస్థ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. సంఘటనలకు, ఆచరణ విధానాలకు, సిద్ధాంతాలకు, హక్కులకు మధ్య ఉన్న అగాదాన్ని న్యాయవిద్య పూరించే ప్రయత్నం చేస్తోందన్నారు. అన్నివర్గాలకు ప్రమాణాలతో కూడిన విద్య అందడంతో పాటు ఆచరణాత్మక విద్య అందుబాటులోకి రావాలని, అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమన్నారు.
ఇక మద్రాసులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణన్ సంతాప సభలో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నమ్మకం, నిజాయితీ బలవంతంగా రావని, విలువల కంటే గొప్ప సంపద లేదన్న విషయం మర్చిపోకూడదన్నారు. సమర్థత, నిబద్ధత, నిర్భీతితో కూడిన స్వతంత్ర వ్యవస్థ మనకు ఉందన్న విషయాన్ని జస్టిస్ లక్ష్మణన్ చెప్పేవారని, ఆ మాటలను గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.
న్యాయమూర్తుల జీవితాలు పూల పాన్పు కాదు..
ఇక మరో వేదికపై ఎన్వీ రమణ మాట్లాడుతూ న్యాయం, ధర్మం కోసం పోరాడాల్సిన వారు మౌనంగా ఉండడం, ఆ సమయంలో స్పందించకపోవడం పిరికితనమని మహాత్మా గాంధీ చేసిన వ్యాఖ్యలను న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న వారు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుత సమయంలో అత్యవసరంగా మారిన శక్తిమంతమైన స్వతంత్ర న్యాయవ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉండాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో అర్థంలేని ప్రచారాలకు, అవసరం లేని విమర్శలకు న్యాయవ్యవస్థలో కీలకంగా ఉన్నవారు బాధితులుగా మారుతున్నారన్నారు. న్యాయమూర్తి జీవితం పూల పాన్పు కాదని, విలాసవంతమైన భవనాల్లో ఖరీదైన జీవితం అనేది అపోహ మాత్రమేనని వ్యాఖ్యానించారు. సొంత అభిప్రాయాలు వెల్లడించేందుకు చాలా పరిమితులు ఉంటాయని, అదే సమయంలో విమర్శలను ఎదుర్కోవాల్సి రావడం, లక్ష్యంగా మారడం సవాలుగా మారుతుందన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.భానుమతి రచించిన ‘జుడీషియరీ..జడ్జ్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పేరిట రాసిన పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎన్నో చారిత్రాత్మక తీర్పులు..
ఇవే కాదు.. మహిళలకు సంబంధించి ఇంటి పనులకూ వేతనం ఉంటుందని, మహిళలు చేసే చాకిరీని తక్కువగా చూడొద్దని ఓ కేసులో వ్యాఖ్యానించారు. ఇళ్లల్లోని మహిళలు ఇంటిల్లిపాదికి అవసరమైన ఆహారం, ఏర్పాటు చేయడం ఉద్యోగంగానే పరిగణించాలని చెప్పడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతోపాటు సుప్రీంకోర్టు కూడా సమాచార హక్కు చట్టం పరిధికి వస్తుందని, జమ్మూ కశ్మీర్‌లో 4G సేవలు పునరుద్ధరించాలని, తమిళనాడుకు సంబంధించి కార్మిక హక్కుల కేసుల్లో తీర్పులు..ఇలా జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్‌లు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ఇనుమడింప జేశాయని చెప్పవచ్చు.
Must Read ;- సవాళ్లను ఎదుర్కొని, ప్రతిభను చాటుకుని.. సీజేగా ఎన్వీ రమణ