(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
జీవితంలో మొదటిసారి నాన్వెజ్ తింటున్నట్టు,ఇప్పుడు తినకపోతే భవిష్యత్తులో తినలేమేమో అన్న భయం ఉన్నట్టు, ఆదివారం వస్తే చాలు మాంసం దుకాణాల వద్ద రద్దీ ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తుంది.ఆదివారం దుకాణాలు మూత పడనుండటంతో జనం ఒక రోజు ముందే ఎగబడి కొనుగోలు చేశారు.Corona సెకండ్ వేవ్ తీవ్రతరంగా ఉన్నప్పటికీ,కళ్ళ ముందే తెలిసిన వారంతా ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ మాంసం కొనుగోలు విషయానికి వచ్చేసరికి వీటన్నింటినీ మర్చిపోతున్నారు విశాఖ జనం.
భౌతిక దూరం కనుమరుగు..
చికెన్,మటన్ దుకాణాల వద్ద ఫిషింగ్ హార్బర్,నగరంలోని ఇతర చేపల మార్కెట్లలో ఆదివారం పూట దృశ్యాలు కరోనా వైరస్‌పై అవగాహన ఉన్న వారిని భయపెడుతున్నాయి.ఆ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేందుకు దుకాణ యజమానులు ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు.ఒకటి రెండు చోట్ల ఏర్పాటు చేసినా సమయాభావం వల్ల మాంసం కొనుగోలుకు జనం ఎగబడుతున్నారు.ఉదయం ఆరు నుంచి 11 గంటల వరకే ప్రజలను దుకాణాల వద్ద కొనుగోలుకు అనుమతిస్తున్నారు.12 గంటల కల్లా ప్రతి ఒక్కరు ఇళ్లకు చేరుకోవాలని ప్రచారం చేస్తున్నారు.ఇక ఫిష్ మార్కెట్‌ల వద్ద భౌతిక దూరమన్నది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించి నాలుగు వారాలు దాటినా విశాఖలో కేసులు తీవ్రత అదుపులోకి రాలేదు.దీంతో గత వారం నుంచి జీవీఎంసి కమిషనర్ జీ సృజన మాంసం దుకాణాలను ఆదివారం పూట మూసి వేస్తూ ఆదేశాలిచ్చారు.గతవారం అమల్లోకి వచ్చిన ఈ విధానం ఈవారం కూడా కొనసాగిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు.దీంతో అప్రమత్తమైన మాంసం ప్రియులు ముందు రోజే కొనుగోలు చేస్తున్నారు.
ముందు రోజే కొనుగోలు..
సాధారణంగా శనివారం పూట మాంసం దుకాణాలు 80 శాతం మేరకు మూసి ఉంటాయి.కానీ ఈ వారం అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి.ఆదివారం పూట ఎటువంటి రష్ ఉంటుందో ఈ శనివారం కూడా అంతే సందడే మాంసం దుకాణాల వద్ద కనిపించింది.ఒక రోజు ముందుగానే కొనుగోలు చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని తినేందుకు జనం ఎగబడుతున్నారు.అసలు వీరిని ఏమనాలో కూడా అధికారులకు అర్థం కావడం లేదు.జనాల సౌలభ్యం కోసం కేజీ, అరకేజీ మాంసాన్ని ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసి శనివారం విక్రయించడం గమనార్హం.
నగర మేయర్‌కు వ్యాపారుల వినతి..
వారమంతా చేసే వ్యాపారం ఒక్క ఆదివారం చేస్తామని,ఆ రోజున దుకాణాలు మూసి వేస్తే తమ ఉపాధి పోతుందని మాంసం విక్రేతలంతా నగర మేయర్ హరి వెంకట కుమారికి మొరపెట్టుకున్నారు.ఇప్పటికే కరోనా వైరస్ వల్ల వ్యాపారాలు సాగడం లేదని,ఒక పూట దుకాణాలు తెరవడం వల్ల బతుకు భారంగా మారుతుందని వివరించారు.ఆమె కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.అయితే జిల్లా యంత్రాంగం అందుకు అంగీకరించకపోవడంతో ఈవారం కూడా నిషేధం అమలు చేస్తున్నారు.
must read ;- అంతా మొక్కుబడి.. విశాఖలో ఇంటింటి సర్వేకు ఫీవర్











