ఏపీలో ప్రజా సమస్యలపై విపక్షాలు ఆందోళనలు చేపట్టేందుకు వీలు లేదన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందన్న వాదనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రేమోన్మాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన రమ్య మృతదేహానికి నివాళి అర్పించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను అడ్డుకున్న జగన్ సర్కారు.. నిన్నటికి నిన్న నరసరావుపేటకు చెందిన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేశ్‌నూ అడ్డుకుంది. తాజాగా వృద్ధాప్య పింఛన్ల కోతపై నిరసన తెలిపేందుకు బయలుదేరిన పార్టీ కీలక నేత, రాప్తాడు టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్‌నూ అడ్డుకుంది. ఫలితంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో సోమవారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులతో పరిటాల వాగ్వాదం
వృద్ధాప్య పింఛన్లను ఇష్టారాజ్యంగా కోతలు కోస్తున్న జగన్ సర్కారుపై ఇప్పటికే ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ అంటూ కొత్త నిబంధనను తెచ్చిన జగన్ సర్కారు.. తాజాగా రెండు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయంటూ మరో కొత్త తరహా కోతలకు దిగింది. ఈ విషయంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాప్తాడు ఇంచార్జీగా ఉన్న పరిటాల శ్రీరామ్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్మవరంలో నిరసనకు దిగారు. అంతేకాకుండా ధర్మవరం ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు రాప్తాడు నుంచి బయలు దేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ధర్మవరం బయటే శ్రీరామ్‌ను అడ్డుకున్నారు. ధర్మవరానికి వెళ్లేందుకు అనుమతి లేదని, నిరసనలకు అసలే అనుమతి లేదని నిలిపేశారు. ఈ సందర్భంగా కారు దిగిన శ్రీరామ్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు కూడా అనుమతి లేదంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదంటే జగన్ స్వామ్యం ఉందా? అంటూ నిలదీశారు. అయినా కూడా పోలీసులు తప్పుకోకపోవడంతో వారిని తోసేసి మరీ శ్రీరామ్ ముందుకు సాగారు. అయితే పోలీసులు టీడీపీ నేతల వాహనాలను నిలిపేయడంతో శ్రీరామ్ కాలి నడకననే ధర్మవరం బయలుదేరారు.
ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు
పరిటాల శ్రీరామ్ పిలుపు మేరకు ధర్మవరం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ధర్మవరం పట్టణానికి చేరుకున్నాయి. శ్రీరామ్ కూడా పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ ధర్మవరం చేరుకున్నారు. పట్టణం బయట అడ్డంకులు కల్పించిన పోలీసులు.. శ్రీరామ్ సహా టీడీపీ శ్రేణులను ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లకుండా పట్టణంలోనూ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. ప్రజా సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తామన్నా కూడా అడ్డంకులు కల్పిస్తారా? అంటూ శ్రీరామ్ పోలీసులపై విరుచుకుపడ్డారు. దీంతో టీడీపీ శ్రేణులు పెద్ద పెట్టున పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెరసి ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Must Read ;- అభాగ్యులకు అండ లోకేశే, జగన్ కాదు










