Rahul Gandhi And Amit Shah Will Arrive Telangana On The 17th Of This Month :
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి చప్పున చల్లారిపోగా.. దాని స్థానంలో మరో వేడి రాజుకుంది. జాతీయ స్థాయిలో నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే రోజు తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నెల 17న ఆ రెండు పార్టీల భారీ బహిరంగ సభలు, కార్యకర్తల నినాదాలతో యావత్తు తెలంగాణ హోరెత్తనుంది. ఈ మేరకు రెండు పార్టీలు కూడా భారీ సన్నాహాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ యువ నేత రాహుల్ గాంధీ ఈ నెల 17న వరంగల్ లో జరగనున్న దళిత, గిరిజన దండోరాలో పాలుపంచుకోనున్నారు. అయితే అదే రోజున తెలంగాణ విమోచన దినాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్న బీజేపీ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆహ్వానించింది. నిర్మల్ లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాలుపంచుకుంటారట.
రాహుల్ అంగీకరించినట్టేనా
మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత టీ కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా రేవంత్ రెడ్డి.. దళిత, గిరిజన దండోరా పేరిట ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు సభలు నిర్వహించిన రేవంత్.. కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో చూపించారు కూడా. ఈ సభలను 17న వరంగల్ లో జరిగే సభతో ముగించనున్నట్లుగా రేవంత్ గతంలోనే ప్రకటించారు. ఈ ముగింపు సభకు రావాలంటూ ఇప్పటికే రాహుల్ గాంధీకి రేవంత్ ఆహ్వానం పంపారు. రాహుల్ నుంచి కూడా ఈ పర్యటనకు సంబంధించి సానుకూల సంకేతమే వచ్చినట్టుగా టీపీసీసీ చెబుతోంది. అయితే అనుకోని అవాంతరాలు ఏవైనా ఎదరైతే.. ఆ రోజు రాహుల్ బిజీగా ఉంటే.. అంతకంటే ముందుగానే రాహుల్ తెలంగాణకు వస్తారట. ఈ విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ రాకున్నా.. వరంగల్ లో ఈ నెల 17న నిర్వహించే సభకు రాహుల్ వస్తున్నట్లుగానే రేవంత్ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. రాహుల్ నుంచి కన్ఫర్మేషన్ మాత్రమే రావాల్సి ఉంది.
వెయ్యి ఊడల మర్రి వద్ద షా సభ
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏటా బీజేపీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఆ పార్టీ తెలంగాణలో బలంగా మారింది. ఓ వైపు పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా నూతనోత్తేజాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం బండి కొనసాగిస్తున్న పాదయాత్రకు ఊహించనంత మేర రెస్పాన్స్ వస్తోవంది. ఇక ఇటీవలే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు దీటుగా ఓ సభను నిర్వహించాలని తలచిన సంజయ్.. తెలంగాణ విమోచనా దినాన్నే అందుకు వేదికగా చేసుకున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ కు వివరించిన ఆయన ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహిస్తున్నామని, అదే రోజున నిర్మల్ లోని వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని, ఆ సభకు రావాలంటూ అమిత్ షాకు కబురు పంపారు. ఈ సమావేశానికి రావడానికి అమిత్ షా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వెరసి ఈ నెల 17న అటు రాహుల్ గాంధీ, ఇటు అమిత్ షా సభలతో తెలంగాణ హోరెత్తనుందన్న మాట.
Must Read ;- రేవంత్ సభలకు వచ్చేవారికి ఏమిస్తున్నారు?