2014 నుంచి మోదీ పాలనలో హక్కులకు భంగం వాటిల్లుతోందని, గతంలో భారతదేశం పూర్తి స్వేచ్ఛాయుత దేశంగా ఉండేదని, అది మోదీ పాలనలో పాక్షికంగా ఆంక్షలవైపు వెళ్తోందని లౌకిక వాదం, ప్రజాస్వామ్య హక్కులపై విశ్లేషించే సంస్థ ఫ్రీడమ్ హౌస్ వెల్లడించింది. మోదీ ప్రధాని అయ్యాక పలు వర్గాలపై అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించింది. భారత్, చైనా, అమెరికా లాంటి దేశాల్లో అమలవుతున్న విధానాలను ప్రస్తావించింది. ఈ మేరకు న్యూస్ లెటర్ విడుదల చేసింది.
చైనాలోనూ హక్కులు హరిస్తున్నారు
ఈ సంస్థ విడుదల చేసిన న్యూస్ లెటర్లో.. చైనాలోనూ హక్కులు హరిస్తున్నారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. 2020లో మీడియాపై సెన్సార్ ఆంక్షలు విధించారని, కొవిడ్ కారణంగా ఆ ఆంక్షలు మరింత కఠినమయ్యాయని వెలిబుచ్చింది. హాంకాంగ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు చైనా లక్షలాది మంది హక్కులను, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించిందని పేర్కొంది. వెనిజులా, కంబోడియాలలోనూ హక్కుల హననం జరిగిందని పేర్కొంది. అయితే ప్రధానంగా పెద్ద దేశాల్లో ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలు, వివక్షా పూరిత విధానాలు ప్రపంచానికి శ్రేయస్కరం కాదని వ్యాఖ్యానించింది.
భారత్‌లో..
ప్రపంచ ప్రఖ్యాత ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరున్న భారత్‌లోనూ హక్కుల హననం జరిగిందని వ్యాఖ్యానించింది. ప్రధాని మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అందుకు దారి తీసినట్టు సదరు సంస్థ వెల్లడించింది. కొవిడ్ సమయంలో బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు చేయూతనందించే విషయంలో నిర్బంధం, ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించడంతో లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడ్డారని, హిందూత్వ అజెండా ముసుగులో అమలైన కొన్ని విధానాల వల్ల మైనార్టీలు ఇబ్బంది పడ్డారని పేర్కొంది. కొవిడ్ వ్యాప్తికి ధిల్లీలో జరిగిన ఓ మతమైన కార్యక్రమాన్ని కారణంగా చూపారని, కొన్ని చోట్ల వర్గాలపై దాడులూ జరిగాయని సదరు న్యూస్ లెటర్ వెల్లడించింది. చైనా అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలు గర్హించాల్సిన మోదీ సర్కారు, బీజేపీ పార్టీ అదే బాటలోకి వెళ్తున్నాయని వ్యాఖ్యానించింది.
అమెరికాలో..
ఇక అమెరికాలోనూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా 2021లో కొన్ని సంఘటనలు జరిగాయని సదరు సంస్థ వెల్లడించింది. 2020 నవంబరులో జరిగిన ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్ అనుసరించిన విధానాలు ఇందుకు కారణమని వెల్లడించింది. అధ్యక్ష భవనం వద్ద జరిగిన అల్లర్లకు ఆయన వైఖరే కారణమని పరోక్షంగా ప్రస్తావించింది. కొన్నిసందర్భాల్లో అమెరికా పోలీసు వ్యవహరించిన తీరు కూడా ఇందుకు కారణమని వ్యాఖ్యానించింది.
చీలీ, సూడాన్ లాంటి దేశాల్లో..
ఇక చీలీ, సూడాన్ లాంటి దేశాల్లో ప్రజానీకం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసే చర్యలకు సిద్ధపడ్డారని, అక్కడి పరిస్థితులు సహకరించాయని వ్యాఖ్యానించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24 దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలకు, ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు తూట్లు పొడిచే చర్యలను చేపట్టాయని సదరు న్యూస్ లెటర్‌లో వ్యాఖ్యానించింది. 1995 తరువాత ఇలాంటి పరిస్థితి మొదటిసారి తలెత్తిందని పేర్కొంది. భారత్‌లో 2006 తరువాత అత్యంత క్లిష్ట పరిస్థితి ఇప్పుడే తలెత్తిందని వ్యాఖ్యానించింది. హక్కుల హననానికి సంబంధించి ‘డెమోక్రసీ అండర్ సీజ్’ అని వ్యాఖ్యానించింది. పౌరసత్వ సవరణ చట్టం అమలు వివాదం కూడా ఇందుకు కారణమని పేర్కొంది. భారత దేశంతోపాటు మూడు పొరుగు దేశాల్లో ఉన్న హిందువులకు పౌరసత్వం ఇచ్చే ప్రతిపాదనలు దేశానికి ఉన్న లౌకికవాద మూల సూత్రాలకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించింది. అయితే భారత ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు.
Must Read ;- ఆదరించిన వారిని వంచిస్తారా.. బీజేపీ నేతల తీరుపై విశాఖవాసులు గరం