ఒకే దేశం..ఒకే ఎన్నిక విధానంపై బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దేశంలో మెజార్టీ శాసనసభల ద్వారా ఆమోదించుకునే విషయంలో బీజేపీ దాదాపుగా విజయానికి చేరువైంది. ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏదేని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తే చాలు.. రాజకీయ పార్టీల పరంగా, చట్ట సభల పరంగా బీజేపీ పైచేయి సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికల విషయంలో లా కమిషన్ ఆమోదం లేదా సిఫారసులు కీలకంగా కానున్నాయి. లా కమిషన్ ఆమోదం లేదా మార్పులు- సిఫారసులతో కూడిన ఆమోదం వస్తే..కేంద్రం 2023 నాటికే జమిలికి జైకొట్టే అవకాశాలూ ఉన్నాయి. అది రాజకీయంగా పార్టీకి సానుకూలమా, వ్యతిరేకమా అనే అంశంపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
22 పార్టీల అంగీకారం..
ఇటీవల లోక్‌సభలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత, మన్మె శ్రీనివాస్‌రెడ్డి జమిలి ఎన్నికలకు సంబంధించి వేసిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానమిస్తూ జమిలి ఎన్నికలకు సంబంధించి పలు అంశాలను వివరించారు. ఇప్పటికే ప్రజా సమస్యలు, న్యాయశాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసిందని చెప్పారు. ఈ జమిలి ఎన్నికలు ఎలా నిర్వహించాలి, రాజ్యాంగ సవరణ, చట్టపరంగా ఉన్న ఇబ్బందులు తదితర అంశాలపై లా కమిషన్ పరిశీలిస్తోందని ఆయన వివరించారు. కాగా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమేనని గతంలో ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. లా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- సమాచారమా,సెంటిమెంటా.. రేవంత్ ‘దక్షిణాది’వ్యాఖ్యల మర్మమేమిటో?

బీజేపీ స్టాండ్ ఇదే..
జమిలి ఎన్నికల నిర్వహణకు బీజేపీ ప్రయత్నిస్తోంది. చట్టపరంగా వచ్చే అడ్డంకులు పక్కన బెడితే..రాజకీయంగా బీజేపీ వ్యూహాత్మాక అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. లోక్‌సభలో ఇప్పటికే బీజేపీకి బలం ఉంది. ఈ ఏడాది రాజ్యసభలోనూ ఆ పార్టీకి, మిత్ర పక్షాలకు సభ్యులు పెరిగే అవకాశం ఉంది. మిత్రపక్షాలు కాకున్నా..ఈ ఎన్నికల విషయంలో పలు పార్టీలు ఇప్పటికే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వారు కూడా రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక జనాభా, సభ్యుల సంఖ్య తదితర అంశాలను పరిశీలిస్తే..దేశం మొత్తం మీద 29 రాష్ట్రాలకు గానూ.. 20 రాష్ట్రాల్లోని శాసనసభల్లో ఆమోదించాల్సి ఉంది. అప్పుడే ఈ తీర్మానానికి విలువ ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు వీలవుతుంది. ఇప్పటికే బీజేపీ, ఎన్డీయే చేతిలో 17 రాష్ట్రాలున్నాయి. త్వరలో తమిళనాడు, కేరళ, పశ్చిమబంగా, అసోం, పుదుశ్చేరి తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అనూహ్య ఫలితాలు వస్తే.. అంటే పశ్చిమబెంగాల్, అసోం, కేరళలో బీజేపీ లేదా కూటమి ప్రభుత్వాలు వస్తే..బీజేపీ, మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల సంఖ్య 20కి చేరుతుంది. అదే జరిగితే.. జమిలికి రాష్ట్రాల ఆమోదం విషయంలోనూ బీజేపీ మరో అడుగు ముందుకేస్తుంది.
ఎన్నికల ఖర్చుతో పాటు..
జమిలి ఎన్నికలకు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం రెఢీ అయింది. ఇందుకు ప్రధానంగా ఎన్నికల ఖర్చును తెరపైకి తెస్తోంది. 2009లో సాధారణ ఎన్నికలకు రూ.1115 కోట్లు ఖర్చు కాగా 2014 ఎన్నికలకు అది రూ.3,870 కోట్లకు చేరిందని నీతి ఆయోగ్ వెల్లడిచింది. దీంతోపాటు నిరంతరం ఏదో ఒక రాష్ట్రం లేదా ప్రాంతంలో ఎన్నికలు ఉండడంతో కోడ్ అమలు తదితర అంశాలతో పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయని బీజేపీ చెబుతోంది. రాజకీయపరంగా చేస్తే.. జమిలి ఎన్నికలు జాతీయ పార్టీలకు లాభించనున్నాయి. సాధారణంగానే రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగిన సందర్భాల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలుమార్లు ఇదే జరిగింది. ప్రత్యేక పరిస్థితులు, సెంటిమెంట్లు, పాలకపక్షంపై తీవ్ర వ్యతిరేకత లాంటి అంశాలున్న సమయాల్లో తప్ప..చాలా వరకు క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. కొన్నిచోట్ల అభ్యర్థులూ ఇలాగే ప్రచారం చేస్తారు. ఒకటి ఇటు..ఒకటి అటు అని చెప్పడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యేకు వేసే ఓటు రాష్ట్రంలోని ఏదేని ఒక పార్టీకి, ఎంపీకి వేసే ఓటు జాతీయ పార్టీకి లేదా రాష్ట్రంలోనే ఉన్న మరో పార్టీకి వేసే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది జరిగినా..జాతీయ పార్టీకి లాభమే అని చెప్పవచ్చు. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరిగితే..రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి ఎంపీల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో వేరే పార్టీకి ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. రాష్ట్రంలో ఎలాగూ ప్రతిపక్షమే గనుక..కేంద్రంతోనో లేదా వేరే కూటమితో కలిస్తే..కేంద్రంలో ప్రాధాన్యం ఉంటుందనే ఆలోచన ఎంపీలు ఎక్కువ గెలుచుకున్న పార్టీలకు ఉండవచ్చు. వీటిలో ఏది జరిగినా.. జాతీయ పార్టీలకు మంచిదే. అందులోనూ కాంగ్రెస్ సమీప కాలంలో కోలుకునే పరిస్థితి లేదని భావిస్తోన్న బీజేపీ..మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు
Also Read ;- హైదరాబాద్‌పై అసద్ ‘యూటీ’ స్కెచ్.. ఏ పార్టీకి ఉపయోగం










