మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడుగా పోటీ చేయనున్నట్టు ప్రకాష్ రాజ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆతర్వాత మంచు వారబ్బాయ్ విష్ణు కూడా అధ్యక్షుడుగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆతర్వాత జీవిత రాజశేఖర్, హేమ కూడా రంగంలోకి దిగడంతో చతుర్మఖ పోటీ ఏర్పడింది. అయితే.. ప్రకాష్ రాజ్ లోకల్ కాకపోవడంతో నాన్ లోకల్, లోకల్ మధ్య పోటీ ఏర్పడింది. ఇదే విషయం గురించి నటి కరాటే కళ్యాణి స్పందించింది. ప్రకాష్ రాజ్ ని మా అధ్యక్షుడిగా ఒప్పుకోం అని, ఆయనకు సపోర్ట్ చేసేది లేదని సినీ నటి, మా సభ్యురాలు కరాటే కళ్యాణి అన్నారు.
పొరుగు భాష నుంచి వచ్చి ఇక్కడ ఆయన అధ్యక్షుడు ఎలా అవుతారు? అని ఆమె ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ గొప్ప నటుడు. తెలుగు వాళ్లకి దగ్గరైన వ్యక్తి. ఒక ఆర్టిస్ట్ గా ఆయన్ని నెత్తిమీద పెట్టుకుంటాం కానీ.. అధ్యక్ష పదవికి ఒప్పుకోలేం. తెలుగు వారే మా అధ్యక్షులు కావాలనేది నా అభిప్రాయం అని తన మనసులో మాటలను బయటపెట్టారు నటి కళ్యాణి. అంతే కాకుండా.. తమిళ్, కన్నడ ఇండస్ట్రీవాళ్లు తెలుగు వారికి వాళ్ల సినిమాల్లో వేషాలు ఇవ్వడం లేదు. అలాంటిది వాళ్లని తీసుకుని వచ్చి ఇక్కడ అధ్యక్షుల్ని ఎలా చేస్తాం అని కళ్యాణి నిలదీశారు.
మనం నడిగర్ సంఘంలో పోటీ చేయగలమా.? ఖచ్చితంగా చేయలేం. అలాంటప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఎలా పోటీ చేస్తారని కళ్యాణి సూటిగా ప్రశ్నించారు. బాగా పాలిస్తున్నారు కదా అని స్టాలిన్ ని తీసుకుని వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని చేయలేం కదా?. మనకు జగన్, కేసీఆర్ ఉన్నారు. స్టాలిన్ వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే ఒప్పుకోం కదా అన్నారు. ప్రకాష్ రాజ్ ఆయన అదోరకం .. సరిగా మాట్లాడనే మాట్లాడరు అని కూడా ప్రకాష్ రాజ్ వ్యవహారికాన్ని కళ్యాణి విమర్శించారు. స్థానికతను ప్రశ్నించే వారికి విలక్షణ నటుడు ఎలాంటి కౌంటర్ వేస్తారో చూడాలి.
Must Read ;- కోపంతో కాదు ఆవేదనతో పుట్టిన ప్యానల్ మాది: ప్రకాష్ రాజ్