పలు రాష్ట్రాలు టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నా ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. పరీక్షలు పెట్టి తీరతామని ప్రభుత్వం పట్టుబట్టింది. విద్యార్థుల ప్రతిభా పాటవాలు నిర్ణయించాలంటే పరీక్షలే ఏకైక మార్గం. అదే అవసరం. అయితే ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యం, భౌతిక దూరం, కొవిడ్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. ఒక వేళ కొన్ని పోటీ పరీక్షలకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించాయి. ఇక ఏపీలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పట్టుబట్టడం, అదే సమయంలో టీడీపీ ప్రథమంగా ఆందోళనకు దిగడం, ఇతర రాజకీయ పక్షాలు, కొన్ని సంఘాలు, సంస్థలు కూడా ఆందోళన చేపట్టాయి. అయినా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి తీరతామని చెప్పడంతో పాటు ప్రతిపక్షాలపై, ప్రతిపక్ష నాయకులపై కొందరు మంత్రులు నోరు పారేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మొత్తం మీద ఏపీలో పరీక్షల నిర్వహణ అంశం ప్రభుత్వం VS ప్రతిపక్షాలు అన్నట్లుగా మారింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటర్ రెండో సంవత్సరంతో పాటు… మొదటి సంవత్సరం, పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సమర్థించుకునే యత్నం..
కాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సూచనల నేపథ్యంలో గురువారం రాత్రి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏపీ విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రెస్ మీట్‌లో పరీక్షలు రద్దుచేస్తున్నట్టు చెప్పారు. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని, ఏపీ విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తాము కూడా పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘ఇంటర్ పరీక్షలపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగిందని, అయితే జూలై 31లోపు ఇంటర్ ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి కనీసం 45రోజుల సమయం పడుతుందని, జులై 31లోపు ఫలితాలు వెల్లడించడం సాధ్యం కాదని, అందుకే రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇక మార్కులు, గ్రేడింగ్‌లు తదితర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
లోకేష్‌కు అభినందనలు..
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు రావడంతో పాటు ఏపీ ప్రభుత్వం పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏకేస్తున్నాయి. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నారా లోకేష్ తోపాటు నాయకులు పలు ట్వీట్‌లు చేశారు. జనసేన పార్టీ కూడా ఇదే కోణంలో ట్వీట్‌లు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయంగా తెలుగు తమ్ముళ్లు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. పదో తరగతి పరీక్షల రద్దు కోసం నారా లోకేష్ ముందు నుంచి పోరాటం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి సంఘాలకు అండగా ఉండడంతోపాటు తానే స్వయంగా ఆందోళన్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా లేఖలు రాశారు. ఆన్ లైన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ న్యాయపోరాటం కూడా చేశారు. పరీక్షల రద్దేయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు.
Must Read ;- పరీక్షల నిర్వహణపై ప్లానేది.. సుప్రీం ధర్మాసనం అసంతృప్తి
పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు అభినందనలు.విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసింది.రెండు నెలల పోరాటం తరువాత @ysjagan గారు దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషం.(1/4)#MentalMama pic.twitter.com/35QCpjIa3C
— Lokesh Nara (@naralokesh) June 24, 2021
వరుస ట్వీట్లు..
ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక లోకేష్ పలు ట్వీట్‌లు చేశారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు అని ట్వీట్ చేయడంతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని, రెండు నెలల పోరాటం తరువాత జగన్ దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషమన్నారు. మరో ట్వీట్‌లో ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18 న తాను మొదటి లేఖ రాసిన సమయంలోనే పరీక్షలు రద్దుచేసి ఉంటే విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ వృథా అయ్యేది కాదని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేదని చెప్పారు. ప్రభుత్వం కనీస మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదని, మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదని, తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు హింసించారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చివాట్లు తినే పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి, ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలని జగన్ రెడ్డి గారిని కోరుతున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు. మొత్తం మీద లోకేష్ ట్వీట్లను రీషేర్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు వైరల్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా విద్యార్థులకు అండగా లోకేష్ నిలబడ్డారని, లేని పక్షంలో ప్రభుత్వానికి ఎదురు చెప్పే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదని, పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చేదని పలువురు ట్వీట్ చేస్తున్నారు. లోకేష్ డిమాండ్‌కి ప్రజా మద్దతు ఉందని, అందుకే లోకేష్ , విద్యార్థులు, తల్లిదండ్రులు పరస్పరం తోడుగా నిలిచారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
మరో భంగపాటు..
అదే సమయంలో ప్రభుత్వం కూడా భంగపాటుకు గురైందని చెప్పవచ్చు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, మూడో వేవ్ వస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యావేత్తలు దాదాపు రెండు నెలలుగా సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎవరు చెప్పినా మేం వినం. మేం చేయాలనుకున్నదే చేస్తామనే రీతిలో వ్యవహించారు. ఇక CBSE, ICSEలతోపాటు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 21 రాష్ట్రాలు 10+2 పరీక్షలను రద్దు చేశాయి. కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యూయేట్స్ పరీక్షలూ రద్దు చేశాయి. అయితే పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకు తీరని నష్టం అనే వాదన తెరపైకి తెచ్చి ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ అంశంతో పాటు పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకే నష్టమని చెబుతూ వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పలేక పోయింది. ఒక్కో పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులను కూర్చోబెడతామని ప్రభుత్వం చెప్పింది. అయితే విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే ప్రభుత్వం చెబుతున్న ప్రకారం పరీక్షల నిర్వహణకు మొత్తం 34,634 గదులు అవసరమవుతాయని, అన్ని గదులు అందుబాటులో ఉన్నాయా అని సుప్రీం ప్రశ్నించింది. మరికొన్ని అంశాల విషయంలో అఫిడవిట్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించడంతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలా ఉంటుందని ఊహించలేదని వ్యాఖ్యానించినట్లూ వార్తలు వచ్చాయి. అదే సందర్భంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకం అని నిరూపించుకోవాలని అనుకోవద్దు. పరీక్షలపై ఇతర రాష్ట్రాల బోర్డులు ఒక పద్ధతిని అనుసరిస్తున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు అలా చేయడం లేదు. ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. పరిష్కారం దొరకని సమస్య కాదు. విద్యార్థులను రిస్క్‌లోకి నెట్టాలనుకోవద్దు అని వ్యాఖ్యానించింది. జులై 31లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంతో పాటు తక్కువ సమయం ఉన్నందున పరీక్షలు రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Must Read ;- లోకేశ్ మాట విని ఉంటే సుప్రీం అక్షింతలు తప్పేవిగా