అచ్చ తెనుగులో ప్రాణము అంటే ఆక్సిజన్. పంచభూతాలతో రూపొందిన ఈ మనిషికి పంచ ప్రాణాలు కూడా అంతే అవసరం. అలాంటి ఆక్సిజన్ తో కూడా మనిషి స్వాహా పర్వం కొనసాగిస్తున్నాడు. చివరికి ఆక్సిజన్ అందక హాహాకారాలు చేయాల్సి వస్తోంది.
గాలితో కొత్త వ్యాపారాలకు తెరతీసి ఈ కలియుగంలో మనిషిని మనిషే బలిపశువును చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఓటు రాజకీయాలతో మునిగితేలాం కదా అందుకే ఇక ఓటూ (O2) రాజకీయాలకు తెరలేపాల్సి వచ్చింది. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగిన సామెత గుర్తుకొస్తోంది. ఏడాదిన్నర కాలంగా కరోనాతో సతమతమవడం చూస్తుంటే ఇప్పుడు ఆక్సిజన్ కోసం వెతుకులాడటం హాస్యాస్పదంగా లేదూ. మనం మాట్లాడే అవకాశం లేకుండా మన నోటికి మాస్క్ వేసేశారు కదా. కరోనా సెకండ్ వేవ్ ను ఎదొర్కోవడంలో సర్కారువారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనడం అతిశయోక్తి కాదు.
అంగారకుడి మీద ఆక్సిజన్ అట
ఈ మాట వినగానే మనం ఎంతో ఎత్తుకు ఎదిగిపోయామని అనిపిస్తోంది కదూ. అక్కడికి నాసా పంపిన ‘పెర్సెవరెన్స్’ కార్బన్ డై ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసిందట. దీన్ని చూసి మనం చంకలు గుద్దుకోవాలేమో. ఎంత ఎత్తుకు ఎగిరామన్నది కాదన్నా కరోనా గుండెల్లో బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. ఇప్పటిదాకా కరోనా విషయంలో మనది డిఫెన్స్ పోరాటమే. ఇది ఎంతకాలం సాగుతుంది. దాన్ని పూర్తిగా ఎదుర్కొనే రోజు ఎప్పుడుస్తుందో అర్థం కావడంలేదు. మనం ఆకాశంలోకి ఎగిరామా లేదా అన్నది ముఖ్యం కాదు.. భూమ్మీద ఇలాంటి విపత్తులొస్తే ఏంచేయాలో తెలిసి ఉండటం చాలా అవసరం అనే సంగతిని ఎవరూ మరచిపోరాదు.
పంచభూతాలతో వ్యాపారం
చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే విషయాన్ని కూడా మనం విస్మరించాం. కరోనాని తక్కువ అంచనా వేసి పీకల మీదికి తెచ్చుకున్నాం. ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు.. దేనికీ ఓ ప్రామాణికత లేదు. ఏది తోస్తే అది చేసేయడమే. పంచభూతాలతో సైతం ప్రణాళికాబద్దమైన వ్యాపారం జరిగిపోతోంది. నిజానికి కరోనాని మించిన పెద్ద భూతం మనిషే అనుకోవాలేమో! ఆవును నమ్మితే పాలిస్తుంది, చెట్టును నమ్మితే ఆక్సిజన్ ఇస్తుంది, పాలించే మనిషి మాత్రం నమ్ముకున్నవారికి గాలి కూడా ఇవ్వలేకపోతున్నాడు. ఆక్సిజన్ విలువ ఇప్పుడు తెలిసిరావడం సిగ్గు చేటు.
కరోనా కోరలు చాచి ఏడాదిన్నర అయ్యిందన్న విషయాన్ని కూడా మనం మరచిపోయాం.. హెల్త్ ఎమర్జన్సీని విధించలేకపోయాం. కరోనాలో మూడు వేరియంట్లు వచ్చాయంటున్నారు.. మరో ముప్పయి వేరియంట్లు రావని గ్యారంటీ ఏమైనా ఉందా? మండుటెండలకు వైరస్ చచ్చిపోతుందనుకుంటే అది రెచ్చిపోతోంది. మనం ఎదిగామా.. ఒదిగామా.. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందనే సామెత మనకు ఉండనే ఉంది.
ఊపిరి ఆడటం లేదా?
ఆక్సిజనా.. ఓస్ ఇంతేకదా అనుకునే సమయం కాదిది. ఆక్సిజన్ లేక ఎవరికీ ఊపిరి ఆడని పరిస్థితి నేడు ఉంది. కరోనా రాకముందు మన దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 6500 మెట్రిక్ టన్నులు అని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడది 7200 మెట్రిక్ టన్నులకు చేరింది. వినియోగం ఎలా ఉందో చూద్దాం. కోవిడ్ కు ముందు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అవసరమయ్యేది. ఇప్పుడది 5000 మెట్రిక్ టన్నులకు చేరింది. ఇవి రోజువారి లెక్కలే సుమా. పైగా ఇలాంటి ఆక్సిజన్ ను తరలించడం కూడా సవాలుగా మారింది.
మెడికల్ ఆక్సిజన్ ను సిలిండర్లలో, క్రయోజెనిక్ ట్యాంకర్ల ద్వారానో ద్రవ రూపంలో తరలిస్తారు. క్రయోజెనిక్ ట్యాంకర్లలో లిక్విడ్ ఆక్సిజన్‌ను మైనస్ 183 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేస్తారు. ఇలాంటి వెసులుబాటు లేకపోవడం దురదృష్టకరం. ఇలాంటి అవసరం వస్తుందని ఊహించకపోవడం ఏమిటి? విశేఖ ఉక్కు ఊపిరి తీసేద్దామంటే చివరికి ఆ ప్లాంటే మనకు ఊపిరిపోస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో కోవిడ్ కేసులు బాగా పెరిగినప్పుడు ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 3,200 మెట్రిక్ టన్నుల వరకూ ఉందని అంచనా వేశారు. కరోనా సెకండ్ వేవ్ వస్తుందని, ఆక్సిజన్ అవసరం మరింత పెరుగుతుందని ఊహించకపోవడం వల్లే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నాం.
భవిష్యత్ అవసరాల మాటేమిటి?
కరోనా మరణాల్లో ఆక్సిజన్ లేక మరణాలు పోతున్న కేసులో ఎక్కువగా ఉన్నాయి. ప్రతి వందమందిలో 30 మంది కరోనా కోరల్లో చిక్కుతున్నారు. రెండు శాతం మంది మరణిస్తున్నారు. అలాంటప్పుడు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయాలి. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించైనా ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అందుకే ఇప్పుడు గట్టెక్కామా అనుకునే కన్నా భవిష్యత్తులో ఇలాంటి విపత్తు వస్తే ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక వేసుకోవడం ఎంతైనా ఉత్తమం. లేకుంటే మొత్తం మానవాళి పంచప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. తస్మాత్ జాగ్రత్త.
– హేమసుందర్
Must Read ;- ఆస్పత్రిలో ఆర్తనాదాలు : ఆక్సిజన్ అందక 20 మంది మృతి, ప్రాణాపాయంలో వందల ప్రాణాలు