దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆక్సిజన్, బెడ్ల కొరతకు సంబంధించి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా..క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఆ వార్తలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వాల ప్రాధాన్యం అంతా కొవిడ్ కట్టడి మాత్రమే. అయితే ఏపీలో బుధవారం రెండు ప్రధాన పత్రికల్లో వచ్చిన అడ్వర్టైజ్‌మెంట్ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగనన్న వసతి దీవెన పథకంపై..
ఏపీలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించనున్నారని ఆ యాడ్ సారాంశం. ఫుల్ పేజీ యాడ్‌లో అంకెలతో సహా ఎంతమందికి ఎన్ని నిధులు ఇస్తారో వివరించారు. వసతి దీవెన పథకం కింద 2020–21 సంవత్సరానికి 10,89,302 విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,048.94 కోట్లు జమచేయనున్నారని, ఆ మొత్తం బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాలో పడుతుందని ప్రకటన ఇచ్చారు. ఇదే ప్రకటనలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక జగనన్న విద్యా దీవెనతో పాటు విద్యారంగంపై ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారనేది కూడా వివరించారు. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యాకానుక, మనబడి ‘నాడు-నేడు’ తదితర పథకాలకు ఎన్నేసి నిధులు కేటాయించారనేది పేర్కొన్నారు. మొత్తం 1,60,75,373 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.25,714 కోట్లు వెచ్చించినట్టు యాడ్ ఇచ్చారు. ఇవి కాకుండా అంగన్‌వాడీల పిల్లలు, తల్లుల పోషకాహారం కోసం ఏటా రూ.1800కోట్ల ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. మొత్తం మీద జగన్ సర్కారు సంక్షేమానికి ప్రాధాన్యం ఏంటనేది ప్రమోట్ చేసుకున్నారని చెప్పవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడాన్ని, పథకం గురించి ప్రజలకు వివరించడాన్ని ఎవరూ తప్పుబట్టరు. గతంలోనూ చాలా ప్రభుత్వాలు ఇలాంటి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో..
అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంత ఖర్చు చేసి ప్రకటన ఇవ్వడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అన్ని నిధులు వెచ్చించి యాడ్ ఇచ్చే బదులు కొవిడ్ నియంత్రణకు సంబంధించి ఖర్చు చేస్తే మరింత బాగుండేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడాన్ని ఎవరూ తప్పబట్టరని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షేమం కంటే ప్రాధాన్యమైంది ప్రాణ రక్షణ కదా అనే కామెంట్లూ వస్తున్నాయి. ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించి చర్చ నడుస్తోంది. మరికొందరు నెటిజన్లు మాత్రం.. జగనన్న వసతి దీవెన పథకం ఇవ్వడం ద్వారా పేదల ఖాతాల్లోకి నిధులు వస్తాయని, కొవిడ్ సమయంలో ఆ నిధులు వారికి ఉపయోగపడతాయనే కామెంట్లూ చేస్తున్నారు.అన్ని నిధులు వెచ్చించి ప్రకటన ఇచ్చే బదులు సంక్షిప్తంగా ఇవ్వడంతోపాటు అదే ప్రకటనకు కొవిడ్ నుంచి రక్షణ నియమాలను కూడా జతచేస్తే మరింత మైలేజీ వచ్చేది కదా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. మొత్తం మీద రోజూవారీగా గత కొన్ని రోజులుగా సగటున పదివేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఫుల్ పేజీ యాడ్‌ల అంశం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.
Must Read ;-పిట్టల్లా రాలుతున్నా పట్టింపు లేదా? జగన్ కాదు.. కంసుడు : నారా లోకేశ్ ఫైర్