దుర్గ గుడిలో అక్రమాలు నిజమేనని ఏసీబీ సోదాల్లో తేలడంతో ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి బుక్కైనట్టేనన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఏపీలో పెను ప్రకంపనలు సృష్టించిన బెజవాడ కనకదుర్గమ్మ గుడి అక్రమాల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేసిందనే చెప్పాలి. గుడి నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్న మాట వాస్తవమేనని ఏసీబీ తేల్చేయగా… ప్రభుత్వం కూడా 15 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అయితే ఈ అక్రమాలన్నింటికీ కేంద్ర బిందువుగా నిలిచిన ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) సురేశ్ బాబుపై చర్యల విషయంలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ అవినీతి అక్రమాలకు దన్నుగా నిలవడంతో పాటుగా వాటిని తన అనుచర వర్గం కోసం పెంచి పోషించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును రక్షించడం కోసమే ఈఓపై చర్యల విషయంలో జగన్ సర్కారు ముందూ వెనుకా ఆలోచిస్తోందన్న విశ్లేషణలు కలకలం రేపుతున్నాయి.
అక్రమాల పరంపర..
బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అక్రమాలంటూ గత కొంతకాలంగా లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో నిజమెంత అన్న విషయంపై సామాన్యులకు అంతగా అవగాహన లేకున్నా… గుడిలోని వెండి సింహాలు చోరీకి గురి అయినంతనే… ఆలయంలో ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న భావనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆలయ వ్యవహారాల్లో అక్రమాల పరంపర కొనసాగుతోందన్న అనుమానాలు అంతకంతకూ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ తరహా అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా మంత్రి వెల్లంపల్లిని సేఫ్ జోన్‌లోకి చేర్చే ఉద్దేశ్యంతో జగన్ సర్కారు ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ చర్యలేవీ ఫలించకపోవడంతో చివరకు ఏసీబీ సోదాలకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయక తప్పలేదు. ఏసీబీ సోదాల్లో ఆలయంలోని దాదాపుగా అన్ని విభాగాల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్న వైనం బయట పడింది. ఈ అక్రమాలన్నీ కూడా ఆయా విభాగాల విభాగాధిపతులుగా ఉన్న సూపరింటెండెంట్‌ల ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా కూడా తేలింది. అంతేకాకుండా సూపరింటెండెంట్‌లకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటుగా వారిని ఆయా అక్రమాలకు పురిగొల్పింది స్వయంగా ఈఓ సురేశ్ బాబేనని కూడా తేలిపోయింది.
Must Read ;- దుర్గగుడిలో రూ.12 కోట్ల కుంభకోణం.. 16 మంది ఉద్యోగుల సస్పెన్షన్
ఈఓను వదిలేసి మిగిలిన ఉద్యోగులపై చర్యలు
ఏసీబీ అధికారులు తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా… చర్యలకు దిగక తప్పని జగన్ సర్కారు… ఈఓను వదిలేసి మిగిలిన ఉద్యోగులందరినీ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వీరందరినీ సస్పెండ్ చేయాలంటూ ఏకంగా ఈఓకే ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నా… ఈ సస్పెన్షన్ ఉత్తర్వుల సందర్బంగా దేవదాయ శాఖ కమిషనర్ అర్జునరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆలయంలో సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న మ్యాక్స్ సంస్థకు సెక్యూరిటీ కాంట్రాక్టు కట్టబెట్టే వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. ఈ విషయంలో తన ఆదేశాలను కూడా ఈఓ పక్కన పెట్టేసిన వైనాన్ని కూడా కమిషనర్ ప్రస్తావించారు. అర్హత లేని మ్యాక్స్ సంస్థ… సెక్యూరిటీ కాంట్రాక్టు టెండర్ల విషయంలో లీస్ట్ వన్‌గా లేకున్నా… ఆ సంస్థకే టెండర్‌ను కట్టబెట్టిన విషయాన్ని ప్రస్తావించిన కమిషనర్… అందులో ఈఓనే కీలకంగా వ్యవహరించారని ఆరోపించారు. అంతే కాకుండా ఆలయంలో అప్పటిదాకా సెక్యూరిటీ కాంట్రాక్టును నిర్వహించిన ఓపీడీఎస్ఎస్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టగా… అందులోని వ్యక్తులే మ్యాక్స్ పేరిట మరో సంస్థను ఏర్పాటు చేసి మరోమారు ఆలయంలో సెక్యూరిటీ సేవల కాంట్రాక్టును పొందినట్లుగా కూడా ఏసీబీ విచారణలో తేలింది.
ఈవో సురేశ్‌బాబే కేంద్ర బిందువు
మొత్తంగా ఆలయంలో జరిగిన అక్రమాలన్నింటికీ ఈవో సురేశ్ బాబే కేంద్ర బిందువుగా నిలిచిన వైనం చాలా స్పష్టంగానే తెలుస్తోంది. ఈవో సురేశ్‌బాబు దుర్గ గుడి ఆలయానికి వచ్చే విషయంలో దేవదాయ శాఖ మంత్రిగా కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెల్లంపల్లి చక్రం తిప్పినట్లుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అప్పటి దాకా అక్కడ పనిచేస్తున్నఅధికారులను తరిమేసే రీతిలో వ్యవహరించిన వెల్లంపల్లి… ఏరికోరి సురేశ్ బాబును తీసుకొచ్చినట్టుగా కూడా ఆరోపణలు వినిపించాయి.
సురేశ్‌బాబు తాను చెప్పినట్టుగా వింటారనే నమ్మకంతోనే వెల్లంపల్లి ఆయనను దుర్గగుడికి తీసుకొచ్చినట్టుగా విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఆ ఆరోపణలన్నీ నిజమయ్యాయని విపక్షాలు చెబుతున్నాయి. మొత్తంగా ఆలయంలో జరిగిన అక్రమాలన్నింటికీ ఈవోనే కీలక పాత్రధారిగా నిలిస్తే… ఆయనను ఏరికోరి మరీ దుర్గగుడికి తీసుకొచ్చిన వెల్లంపల్లి కీలక సూత్రధారే కదా అంటూ విపక్షాలు తమదైన శైలి పదునైన విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉద్యోగులపైనో, ఈవో పైనే చర్యల వరకే పరిమితం కాకుండా.. అక్రమాలన్నింటికీ కీలక సూత్రధారి అయిన మంత్రి వెల్లంపల్లిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈ వ్యవహారంలో అడ్డంగా బుక్కైన వెల్లంపల్లిని జగన్ సర్కారు రక్షిస్తుందో, లేదంటే శిక్షిస్తుందో చూడాలి.
Also Read ;- మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్.. జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు