సినిమాకి కష్టకాలం వచ్చిందా? కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మళ్లీ చిత్ర పరిశ్రమపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత ఏడాది లాక్ డౌన్ తో చిత్ర పరిశ్రమ దాదాపు కుదేలైపోయింది. ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ సెకండ్ వేవ్ మళ్లీ చిత్ర పరిశ్రమను వణికిస్తోంది. ఇప్పటికే చాలా షూటింగులు నిలిచిపోయాయి. సినిమా విడుదలలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కూడా కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.
థియేటర్లు మూసివేతకు నిర్ణయం
థియేటర్లు మూతపడక తప్పని పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. దాంతో ఈ నెల 23న విడుదల కావలసిని సినిమాలన్నీ వాయిదా తప్పక పరిస్థితి నెలకొంది. ఏపీకి సంబంధించి ఇంకా ఎలాంటి ఉత్తర్వ్యులూ వెలువడలేదు. ఈ వారం విడుదల కావలసిన సినిమాలు కూడా వాయిదా పడే సూచనలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రం ఈ నెల 23న విడుదల కావలసి ఉంది. దీని ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా రెండ్రోజుల క్రితం జరిగింది.
వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ సినిమా నిర్మించారు. ఇందులో కేసీఆర్ గా శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే తేజ సజ్జా హీరోగా రూపొందిన ‘ఇష్క్’ చిత్రాన్ని కూడా ఈ నెల 23న విడుదల చేయాల్సి ఉంది. ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అలాగే ‘కథానిక’,‘శుక్ర’ అనే సినిమాలు కూడా ఈ నెల 23న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాల విడుదల వాయిదా పడక తప్పదు.
ఈ సినిమాల విడుదలకు సంబంధించి నిర్మాతలు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అసలు కరోనా సమయంలో సినిమాలు నిర్మించడమే ఓ సాహసం. ఇలాంటి సమయంలో సినిమాలు తీసిన అనేకమంది ఆర్థికంగా కూడా నలిగిపోయారు. మంచి సినిమాలు తీయాలి, సినీ పరిశ్రమను ఆదుకోవాలి అనే సంకల్పంతో కరోనా పరిస్థితులను కూడా లెక్కచేయకుండా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడున్న కరోనా పాండమిక్ కండిషన్ లో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ లేదా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను తప్పనిసరి పరిస్థితుల్లో 50 మంది కార్మికులతో మాత్రమే చేసుకోవాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.
ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. త్వరలో విడుదల కావలసిన పెద్ద సినిమాలన్నీ ఒక్కొటొక్కటిగా వాయిదా పడుతున్నాయి. సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్ ల వారికి వ్యాక్సిన్ వేయించే విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగినట్టు చెబుతున్నారు. వ్యాక్సిన్ వచ్చి ఇంతకాలమైనా ఎందుకు ఆలస్యం చేశారన్నది అర్థం కాదు. సీసీసీ ఆధ్వర్యంలో త్వరలోనే కార్మికులందరికీ వ్యాక్సిన్ వేసే ప్రక్రియను రెండు రోజుల్లో ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కరోనా పాజిటివ్ కు గురైనట్టు సమాచారం. ఈ కేసులు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. పరిస్థితులు అదుపులోకి రాకపోతే మళ్లీ ఓటీటీనే మార్గంగా కనిపిస్తోంది.
-హేమసుందర్
Must Read ;- కరోనా కోరల్లో చిత్ర పరిశ్రమ విలవిల