(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
ఆదివారం ఉదయం వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి బాజాలు మోగించేందుకు అంతా రెడీ అవుతున్నారు. వారం రోజుల్లో కొడుకు ఇంటికి వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ అంతలోనే ఊహించని పిడుగులాంటి వార్త ఆ ఇంట్లో విషాదం నింపింది. రౌతు జగదీష్.. దేశమంటే భక్తి.. దానికి తోడు కండలు తిరిగిన శరీరం, చురుకుగా కదిలే నైజం.. ఆ లక్షణాలు అతడ్ని కోబ్రాదళానికి నాయకుడిగా ఎంపికయ్యేలా చేశాయి. విధుల్లో చేరినప్పటి నుంచి కోబ్రాదళం తరపున ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నాడు.. మావోయిస్టుల గుండెల్లో ధడ పుట్టించాడు. కానీ అతడి ధైర్య, సాహసాలు చూసిన విధికి కన్నుకుట్టినట్టు ఉంది. త్వరలో జీవితభాగస్వామితో పాటు ఏడు అడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్ర చేసింది. ఆ సరదా తీరకుండానే మావోయిస్టుల రూపంలో మృత్యువై కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో పెను విషాదం అలముకుంది.
ఎదురు కాల్పులలో ..
చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు, సీఆర్పీఎఫ్ జవాన్ 27 ఏళ్ల రౌతు జగదీష్ వీరమరణం పొందాడు. జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది విజయనగరం జిల్లా మక్కువ మండలం కంచేడువలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్ 2010లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. బీజాపూర్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. విధుల్లో చేరిన కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మృతుడి తండ్రి సింహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైంది.
వచ్చేనెల 22న పెళ్లి
జగదీష్‌కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలి అనుకున్నాడు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని శోకసంద్రంలోకి నెట్టేసింది. కొండంత ఎదిగిన కొడుకు.. పేరు ప్రఖ్యాతులు సాధించాడనుకున్న బిడ్డ మృతి చెందాడన్న వార్తతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. చేతికి అందొచ్చాడు .. ఇంటి బరువు బాధ్యతలు చూసుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు.
శోకసంద్రంలో
జగదీష్ మృతితో గాజులరేగ, కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్ డే పాటిస్తామని యువకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు, ఆప్తులు పట్టణంలో పెద్దసంఖ్యలో సంతాప ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తన పోలీసు బృందంతో జగదీష్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Must Read ;- మావోయిస్టులతో లింకుల ఆరోపణలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు