(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం మన్యంలో మృత్యుఘోష వినిపిస్తోంది. అంతుచిక్కని వ్యాధి అడవి బిడ్డల ప్రాణాలను తీస్తోంది. శరీర భాగాలు పాడై, కాళ్లు, శరీరంపై వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఈ వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఏ రకమైన చికిత్సకూ అది నయం కాకపోవడంతో అధికారులు తల్లడిల్లుతున్నారు. పనిపాటు చేసుకుంటూ, ఆరోగ్యంగానే ఉంటూ ఆకస్మికంగా మృత్యువాత పడుతుండటంతో గిరిజనులు భయకంపితులవుతున్నారు. ఏమిచేయాలో పాలుపోక ఆర్తనాదాలు పెడుతున్నారు.
చిల్లమామిడి గూడేంలో మరణ మృదంగం
విజయనగరం జిల్లా పాచిపెంట మండలం చిల్లమామిడి గూడేనికి చెందిన పలువురు గిరిజనులు వరుసగా ఈ అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. ఈ గూడేనికి చెందిన ముఖి వెంకటి(55), ముఖి పెద్దమ్మి(45), సింబోయిన సింహాచలం, ముఖి అమ్మన్న, ముఖి కోతాయ్య, ముఖి గంగమ్మ, ముఖి అప్పలస్వామి, సింబోయిన చిన్నయ్య కొద్ది రోజుల్లోనే వరుసగా మరణించారు. ఏ క్షణాన ఎవరికి, ఏమి జరుగుతుందోనని ఆ గ్రామస్తులు భయపడుతున్నారు.
స్పందించిన ఎమ్మెల్యే
సాలూరు ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఈ సంఘటనపై స్పందించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకుని గిరిజనులను కాపాడాలని వైద్యాధికారులను కోరారు.
మండి కల్లు తాగడం వల్లే ..
గిరిజనులు తరచుగా మండి కల్లు తాగడం వల్లే ఈ వ్యాధి సోకుతున్నట్లు, అందుకే ఆకస్మికంగా చనిపోతున్నట్లు భావిస్తున్నామని గురివినాయుడుపేట పీహెచ్‌సీ డాక్టర్ ఎస్.రవిశంకర్ తెలిపారు. అయితే అది ఏ వ్యాధో నిర్ధారించాల్సివుందని, ఉన్నతాధికారులకు మరణాలపై నివేదిక పంపించామన్నారు.
ఇటువంటి సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుండటం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. వైద్యాధికారులు ఇకనైనా వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Must Read ;- మిస్టర్ కూల్ .. ఏమైంది మీకు?