వెండితెరకి హీరోగా పరిచయం కావడమనేది అంతతేలికైన విషయమేం కాదు. బయటివారు సినిమా ఆఫీసుల చుట్టూ అదేపనిగా తిరుగుతూ నానాఅవస్థలు పడవలసి ఉంటుంది. స్టార్ హీరోల వారసులకు మాత్రం అలాంటి కష్టాలు పడవలసిన పనిలేదు. హీరోగా ఎంట్రీ ఇవ్వడమనేది వాళ్లకి చాలా తేలిక. కాకపోతే కంటెంట్ వున్న వారు మాత్రమే కటౌట్ వరకూ వెళ్లగలుగుతారు. వారసులుగా ఎంట్రీ ఇచ్చినవారిలో కొంతమంది మాత్రమే ఈ రేసులో కొనసాగుతూ ఉండటమే ఇందుకు నిదర్శనం. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన హీరోల వారసులలో, శ్రీహరి తనయుడు మేఘాంశ్ కూడా వున్నాడు. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి క్రితం ఏడాదే రంగంలోకి దిగాడు.
తెలుగు తెరపై యాక్షన్ హీరోగా .. పవర్ఫుల్ విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీహరి మంచిపేరు సంపాదించుకున్నాడు. ఏ పాత్రను పోషించినా, ఆ పాత్రపై తనదైన ముద్రవేశాడు. డైలాగ్ డెలివరీలోను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆయన ఎక్కువగా ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసతో కూడిన డైలాగ్ డెలివరీతో మాస్ ఆడియన్స్ కి బాగా చేరువయ్యాడు. అలాంటి శ్రీహరి హఠాత్తుగా చనిపోవడంతో, ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా ఆయన వారసులు వస్తే బాగుంటుందనే ఆశాభావాన్ని అభిమానులు వ్యక్తం చేశారు. దాంతో శ్రీహరి తనయుడు మేఘాంశ్ .. ‘రాజ్ దూత్’ అనే సినిమాతో క్రితం ఏడాది హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
మేఘాంశ్ చేసిన ‘రాజ్ దూత్‘ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథాకథనాల సంగతి అటుంచితే, సరైన ప్రమోషన్ లేకపోవడం కూడా ఆ సినిమా పరాజయానికి ఒక కారణమనే టాక్ వినిపించింది. లుక్ పరంగా ఓకే అనిపించుకున్నాడు .. నటన పరంగా పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. కుర్రాడు మంచి ఒడ్డూ పొడుగూ ఉండటంతో, కాస్త కసరత్తు చేస్తే హీరోగా నిలబడతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మళ్లీ ఏ దర్శకుడితో కలిసి ఎలాంటి కంటెంట్ తో మేఘాంశ్ వస్తాడా అని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఆయన రెండవ సినిమా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.
Must Read ;- దర్శకుల వారసులు హీరోలు గా రాణించలేరా?
కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా సతీశ్ వేగేశ్నకి మంచి పేరు వుంది. ‘శతమానం భవతి‘ .. ‘శ్రీనివాస కల్యాణం’ .. ‘ఎంతమంచివాడవురా’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి ఆయన ఈ సారి ‘కోతి కొమ్మచ్చి’ అనే కథను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. మేఘాంశ్ శ్రీహరి కథానాయకుడిగా చేస్తున్న ఈ సినిమాతోనే, సతీశ్ వేగేశ్న తన తనయుడు ‘సమీర్ వేగేశ్న’ను మరో హీరోగా పరిచయం చేస్తున్నాడు. రిద్ధి కుమార్ – మేఘ చౌదరి కథానాయికలుగా అలరించనున్నారు. రాజేంద్రప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. అన్నపూర్ణ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.
పూర్తి వినోద ప్రధానంగా సాగే ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి సినిమాతోనే ఎక్కడా తడబడకుండా మంచి మార్కులు కొట్టేసిన మేఘాంశ్, మళ్లీ రంగంలోకి దిగడం పట్ల శ్రీహరి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడి వారసుడు ఈ సినిమాతో హీరోగా నిలబడాలని వాళ్లంతా భావిస్తున్నారు. తన తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన మేఘాంశ్, సినిమా వాతావరణాన్ని ఇప్పటికే పూర్తిగా అర్థం చేసుకుని ఉంటాడు. ఓర్పుతో ఎత్తుపల్లాలను దాటుకుంటూ, తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటాడేమో చూడాలి.
Also Read ;- శాండిల్ వుడ్ లో మరో వారసుడు వస్తున్నాడు…!